మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 మే 2021 (11:19 IST)

ఆనందయ్య మందు ఫార్ములా కోసం అధికారుల వేధింపులు.. హైకోర్టులో వ్యాజ్యం

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కరోనా రోగులకు స్వస్థత చేకూర్చేందుకు ఇచ్చే మందు ఫార్ములా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు వేధిస్తున్నారా? అవుననే అంటున్నారు ఆనందయ్య సన్నిహితులు. ఇదే అంశంపై ఆనందయ్య హైకోర్టులో ఓ వ్యాజ్యం దాఖలు చేశారు. 
 
కొవిడ్‌ నివారణ మందు తయారీకి అవసరమైన పదార్థాలతో పాటు ఫార్ములా చెప్పాలని అధికారులు వేధిస్తున్నారంటూ ఆ వ్యాజ్యంలో ఆనందయ్య పేర్కొన్నారు. మందు పంపిణీ విషయంలో జోక్యం చేసుకోకుండా అధికారులను ఆదేశించాలని కోరారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఉచితంగా మందు పంపిణీ చేస్తున్నానని.. ఈ కార్యక్రమానికి రక్షణ కల్పించేలా ఆదేశించాలన్నారు.
 
కాగా, రాష్ట్ర 'లోకాయుక్త ఆదేశాల మేరకు మందు విషయంలో వాస్తవాలు తేల్చేందుకు నెల్లూరు జిల్లా కలెక్టర్‌ త్రిసభ్య కమిటీ వేశారు. కమిటీ ఆయుష్‌ కమిషనర్‌తో వచ్చి నమూనాలు సేకరించింది. మందుపై ప్రజలు ఎవరూ నెగెటివ్‌గా చెప్పడం లేదని నివేదికలో పేర్కొన్నారు. మందు తయారీకి వాడే ఫార్ములా చెప్పాలని త్రిసభ్య కమిటీ సభ్యులతో పాటు ఆయుష్‌ కమిషనర్‌ ఒత్తిడి చేస్తున్నారు. 
 
కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో భారీగా ఖర్చు చేయలేని సామాన్య ప్రజలను నా మందు ఆకర్షించింది. ప్రస్తుతం నేను మందును ఉచితంగా పంపిణీ చేస్తున్నాను. అయితే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు, అధికార యంత్రాంగం కలిసి దీన్ని కమర్షియలైజ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన కలుగుతుంది. 
 
అధికరణ 301 ప్రకారం స్వేచ్ఛాయిత వృత్తి, వాణిజ్యం నిర్వహించుకోవచ్చు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని నా ఆయుర్వేద వృత్తిలో అధికారుల జోక్యాన్ని నిలువరించండి' అంటూ ఆనందయ్య దాఖలు చేసిన వ్యాజ్యంలో పేర్కొన్నారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. ఈ నెల 31వ తేదీకి వాయిదావేసింది.