మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 మే 2021 (09:39 IST)

నేడు ఎన్టీఆర్ జయంతి : తెలుగు జాతికి నిరంతర స్ఫూర్తి

ఎన్‌టీఆర్‌.. ఈ మూడు అక్షరాలు చెబితే తెలుగు వారి హృదయాలు ఉప్పొంగుతాయి. ఏ ప్రాంతంలో, ఏ దేశంలో ఉన్న తెలుగువారైనా ఎన్‌టీఆర్‌ మావాడు అంటూ సగర్వంగా చెప్పుకుంటారు. ఇందుకు కారణం తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఆయన జీవితం సాగింది. 
 
తెలుగు సినిమాలలో ఆయన వేసిన పాత్రల ప్రభావం ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేయడం కూడా కారణం. సినిమాలలో ఉన్నా, రాజకీయాలలో ఉన్నా విలువల విషయంలో ఆయన ఏనాడూ రాజీపడలేదు. మాట చెబితే దానికి కట్టుబడి ఉండేవారు. తన పాలనలో పేదలకు సంక్షేమ కార్యక్రమాలను అందించటం ద్వారా వారి హృదయాలలో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారు. 
 
సినిమాలలో ఆయన పోషించిన పాత్రలు ధీరోదాత్తమైనవి. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయడం, పేదలకు అండగా నిలబడటం వంటి పాత్రల వలన పేదల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకోవటానికి కారణమయ్యాయి. 
 
ఆ పాత్రలను పోషించడమే కాదు వాటిని తనకు తాను అన్వయించుకొని సమాజంలో నెలకొన్న చెడును రూపుమాపటానికి, రాజకీయాల్లో నెలకొన్న అవినీతిని అంతమొందించటానికి, పేదలు, బడుగు బలహీనవర్గాలకు అండగా నిలవడానికి ఆయన రాజకీయాలలోకి అడుగుపెట్టారు. ఎన్‌టీఆర్‌ అనే ఒక మహాశక్తి రాజకీయ రంగంలో అడుగిడడమే తెలుగునాట నాడు పెనుసంచలనం. అలాంటి మహనీయుడి జయంతి నేడు.