శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 మే 2021 (17:21 IST)

ఆనందయ్య మందు సంగతేంటి? త్వరగా అధ్యయనం పూర్తి చేయండి : ఉపరాష్ట్రపతి

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామ వాసి ఆనందయ్య కరోనా రోగులకు ఇస్తున్న మందుపై ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఆరా తీస్తున్నారు. ఆ మందు సంగతేంటి? త్వరగా అధ్యయనం పూర్తి చేయాలంటూ సూచించారు. 
 
ఒక్క ఏపీలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆనందయ్య ఆయుర్వేదం మందు మంచి ఆదరణ లభించింది. ఈ కరోనా ఔషధంపై ఆయుష్ శాఖ ఆఅధ్యయనం కొనసాగుతోంది. దీనిపై భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆరా తీశారు. 
 
ఆనందయ్య ఔషధంపై జరుగుతున్న అధ్యయనం వివరాలను ఆయన కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి కిరణ్ రిజిజు, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవను అడిగి తెలుసుకున్నారు.
 
తొలుత కిరణ్ రిజిజుకు ఫోన్ చేసిన ఆయన... వీలైనంత త్వరగా అధ్యయనం పూర్తిచేయాలని సూచించారు. అందుకు కిరణ్ రిజిజు బదులిస్తూ... మంత్రాలయంలోని ఆయుష్ శాఖకు చెందిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఏఎస్) ఆధ్వర్యంలో ఆనందయ్య మందుపై అధ్యయనం జరుగుతోందని వెంకయ్యనాయుడికి తెలిపారు.
 
ఆనందయ్య మందు వాడిన 500 మంది నుంచి సేకరించిన సమాచారాన్ని ఈ అధ్యయనంలో వినియోగిస్తున్నారని, త్వరలోనే నివేదిక వస్తుందని బదులిచ్చారు. ప్రజలకు సంబంధించిన ఎంతో ప్రాధాన్యత ఉన్న అంశం కావడంతో, లోతైన అధ్యయనం జరుగుతోందని, దేనిపైనా రాజీపడకుండా వెళుతున్నందున కొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు. 
 
ఆ తర్వాత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవకు ఫోన్ చేశారు. ఆనందయ్య మందు ఐసీఎంఆర్ పరిధిలోకి రాదని, ఆయుష్ శాఖకు సంబంధించిన అంశం అని బలరాం వివరించారు. ఇప్పటికే ఆయుష్ శాఖ అధ్యయనం చేస్తున్నందున, ప్రత్యేకంగా ఐసీఎంఆర్ కూడా అధ్యయనం చేయాల్సినంత ఆవశ్యకత లేదని తెలిపారు.