శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 14 మార్చి 2017 (02:03 IST)

పదో తరగతి పరీక్షల సమయంలో సినిమా విడుదల: నిర్మాతకు ఎన్ని గట్స్ ఉండాలి

చిత్ర పరిశ్రమ ఓ ఉమ్మడి కుటుంబం వంటిది. ఇక్కడ మా పల్లెల్ని మించిన ప్రోత్సాహం, ఆదరణ, సహకారం చూసి ఎంతో ఆనందపడ్డా అంటున్న ప్రకాశరావుకు మా అబ్బాయి పేరుతో తీస్తున్న ఒక్క సినిమాతో వంద సినిమాలు తీయాలన్నంత ఉత్సాహం వస్తోందని చెప్పారు.

శ్రీవిష్ణు, చిత్ర శుక్ల జంటగా కుమార్‌ వట్టి దర్శకత్వంలో వెన్నెల క్రియేషన్స్‌ పతాకంపై ‘బేబీ’ సాక్షి సమర్పణలో బలగ ప్రకాశరావు నిర్మించిన ‘మా అబ్బాయి’ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి. స్వశక్తితో పనిచేస్తూ, కష్టపడి ఉన్నత స్థాయికి వచ్చిన ప్రకాశరావు నా కుటుంబమే నా ఆస్తి... నా ఆత్మ విశ్వాసమే నా సంపద... నా క్రమశిక్షణే నా పెట్టుబడి అంటున్నారు. సినిమా రంగంతో ఇంతకు ముందు తనకసలు పరిచయమే లేదు. మా ప్రాంతంలో ‘సినిమా పరిశ్రమ ఓ రంగుల ప్రపంచం. అదొక భిన్నమైన వాతావరణం. తెరపై నటించేవారి కన్నా తెరవెనుక నటించేవారే ఎక్కువ’ అని ప్రచారంలో ఉండేది. కానీ, అదంతా నిజం కాదని ఈ సినిమా నిర్మాణంలో అర్థమవుతూ వచ్చింది. చిత్ర పరిశ్రమ ఓ ఉమ్మడి కుటుంబం వంటిది. ఇక్కడ మా పల్లెల్ని మించిన ప్రోత్సాహం, ఆదరణ, సహకారం చూసి ఎంతో ఆనందపడ్డా అంటున్న ప్రకాశరావుకు మా అబ్బాయి పేరుతో తీస్తున్న ఒక్క సినిమాతో వంద సినిమాలు తీయాలన్నంత ఉత్సాహం వస్తోందని చెప్పారు. అదేదో ఆయన మాటల్లోనే విందాం.  
 
మొదట్లో నేను ‘ఈ ఒక్క సినిమా పూర్తి చేయగలిగితే చాలు’ అనుకున్నా. ఇప్పుడు మాత్రం నా ఆలోచన మరోలా ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రోత్సాహం చూసిన తర్వాత 100 సినిమాలు చెయ్యాలనేంత ఉత్సాహం వచ్చింది. నిర్మాతగా ఈ ప్రయాణంలో కొందరు పెద్దల్ని కలసిన తర్వాత క్రమశిక్షణ గురించి తెలుసుకున్నా. నిర్ణీత సమయంలో సినిమా పూర్తి చేయాలని అర్థమైంది. మా సినిమాకి చేసిన లైట్‌ బాయ్‌ నుంచి దర్శకుడి వరకు అందరూ ప్రతిభావంతులే. వీరి సహకారం మరువలేను. ప్రత్యేకించి వారాహి చలన చిత్రం సాయి కొర్రపాటిగారు పెద్దన్నలా ఆదరించారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ డి. సురేశ్‌బాబుగారు మార్గదర్శిగా నిలిచి, స్ఫూర్తినిచ్చారు. సురక్ష ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత మల్కాపురం శివకుమార్‌ గారు అండగా నిలిచారు. వీరందరి సహకారం నాకెంతో ఆత్మస్థైర్యాన్నిచ్చింది. 
 
నాకు అవగాహన లేకపోతే ‘మా అబ్బాయి’ విడుదల వరకూ వచ్చేది కాదు. సినిమాపై ఎలాంటి అంచనాలు లేకపోతే... ప్రేక్షకుల్లో, ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఇంత ఆసక్తి నెలకొనేది కాదు. ఎగ్జామ్స్‌ టెన్త్‌ స్టూడెంట్స్‌కి మాత్రమే కాదు, మా సినిమా యూనిట్‌ సభ్యులకు కూడా. ఈ సినిమాపైనే మా అందరి భవిష్యత్తు ఆధారపడి ఉంది. సినిమాపై మాకెంతో నమ్మకముంది. ఆలస్యంగా విడుదల చేయడం ఇష్టంలేక ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. టెన్త్‌ ఎగ్జామ్స్‌ ప్రభావం మా సినిమాపై ఉండదు. ఇంటర్, డిగ్రీ పరీక్షలు పూర్తి కావొస్తున్నాయి. మా సినిమా స్టూడెంట్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం మాకుంది. కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. వసూళ్లు, విజయంపై మాకెలాంటి అనుమానాలు లేవు.