టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత
టాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 68 యేళ్లు. ఆయన ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఐదు రోజుల క్రితం ఆస్పత్రిలో చికిత్స కూడా తీసుకున్నారు.
ముళ్ళపూడి బ్రహ్మానందం కుమారుడు ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. ఆయన వచ్చిన తర్వాత బుధవారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయనకు భార్య మంగాయమ్మ, కుమారుడు సతీశ్, కుమార్తె మాధవి ఉన్నారు.
దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు ముళ్లపూడి బ్రహ్మానందం వరుసకు బావ అవుతారు. ఈవీవీ సోదరిని ఆయన పెళ్లి చేసుకున్నారు. తెలుగులో ముళ్లపూడి పలు చిత్రాలను నిర్మించారు. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలిపారు.