శనివారం, 30 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (09:57 IST)

"మనమంతా దుర్యోధనులం... పరిశుద్ధుడైన అర్జునుడిగా మారదాం": రజినీకాంత్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఆధ్యాత్మిక వచనాలు పలికారు. "మనమంతా దుర్యోధనులం... పరిశుద్ధుడైన అర్జునుడిగా మారదాం" అని ఈ మానవకోటికి పిలుపునిచ్చారు. అలాగే, తనకు పవర్ అంటే ఇష్టమేనని కానీ, అది అందరూ ఊహించే

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఆధ్యాత్మిక వచనాలు పలికారు. "మనమంతా దుర్యోధనులం... పరిశుద్ధుడైన అర్జునుడిగా మారదాం" అని ఈ మానవకోటికి పిలుపునిచ్చారు. అలాగే, తనకు పవర్ అంటే ఇష్టమేనని కానీ, అది అందరూ ఊహించే ‘పవర్‌’ కాకుండా ఆధ్యాత్మికతకు సంబంధించినదని వ్యాఖ్యానించారు. పరమహంస యోగానంద రచించిన ‘ది డివైన్ రొమాన్స్’ తమిళ అనువాదం ‘దైవీక కాదల్‌’ పుస్తకావిష్కరణ కార్యక్రమం శనివారం చెన్నైలో జరిగింది. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం రజినీకాంత్ మాట్లాడుతూ.. తాను ఒక నటుడిగా, సూపర్‌స్టార్‌గా చెప్పుకోవడం కంటే, ఆధ్యాత్మికవేత్తగా చెప్పుకోవడానికే గర్వపడతానని అన్నారు. 
 
‘డబ్బు, పేరు కావాలా.. ఆధ్యాత్మికత కావాలా? అనడిగితే ఆధ్యాత్మికతనే కోరుకుంటాను.’ అని చెప్పారు. ఆధ్యాత్మికత చాలా పవర్‌ఫుల్‌ అని, తాను పవర్‌ని ఇష్టపడతానని అన్నారు. పవర్‌ అంటే తప్పుగా అనుకోవద్దని, ఇది ఆధ్యాత్మికత పవర్‌ అని చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘పడయప్ప (నరసింహ) తరువాత సినిమాలు మానేయాలని నిర్ణయించుకున్నాను.
 
2008-09లో సచ్చిదానంద నాకు మంత్రోపదేశం చేశారు. సినిమాలు మానొద్దని, శక్తివంతమైన సినిమాల ద్వారా ఆధ్యాత్మిక విషయాల్ని ప్రజలకు చేరువచేయాలని సూచించారు. తరువాత బెంగళూరులోని ఇంట్లో చదువుతున్నప్పుడు పుస్తకంలో మహావతార్‌ బాబాజీ ఫోటోలో కాంతి కనిపించింది. అది భ్రమో.. అనుభూతో తెలీదు. ఆతర్వాత ‘బాబా’ సినిమా స్క్రిప్టు తట్టింది. సీను బై సీను దానంతట అదే వచ్చేసింది. వెంటనే చెన్నై వచ్చి ‘బాబా’ సినిమా నిర్మించాలని నిర్ణయించా. కథ, స్క్రీన్‌ప్లే నేనే రాశాను. వ్యాపార రీత్యా బాగా ఆడకపోవడంతో డబ్బులు తిరిగిచ్చినట్టు గుర్తు చేశారు. 
 
క్రియా యోగంతో నా జీవితమే మారిపోయింది. సామాన్య ప్రజలకు ఆధ్యాత్మికతను చేరువ చేయాలని ఉద్దేశంతో చెప్పినదే ధ్యానం. మన ఇంటికి ఒక అతిథి వస్తున్నాడంటే ఇల్లంతా ఎంతో శుభ్రంగా ఉంచుతాం. అలాంటిది దేవుడు మన మనసులోకి రావాలంటే మనం ఇంకెంత శుద్ధంగా ఉండాలి? మనమందరం దుర్యోధనులమే. దుర్యోధనుడి వలె మనకీ ఏది మంచో, ఏది చెడో తెలుసు. కానీ, పాటించం. అబద్ధం చెప్పకూడదని తెలిసి అబద్ధం చెబుతాం. మనం దుర్యోధనులం కాకుండా శ్రీకృష్ణ పరమాత్ముడికి తనను తాను అర్పించి పరిశుద్ధుడైన అర్జునుడిగా మారదాం’ అని రజనీకాంత్ పిలుపునిచ్చారు.