రారా పెనిమిటి అంటోన్న నందిత శ్వేత
భర్త రాక కోసం..భార్య పడే విరహ వేదన నేపథ్యంలో సింగిల్ క్యారక్టర్ తో రూపొందిన చిత్రం `రారా పెనిమిటి`. శ్రీ విజయానంద్ పిక్చర్స్ బేనర్ లో రూపొందిన ఈ చిత్రంలో సింగిల్ క్యారక్టర్ లో నందిత శ్వేత నటించగా సత్య వెంకట గెద్దాడ దర్శకత్వం వహించారు. శ్రీమతి ప్రమీల గెద్దాడ నిర్మాత. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా సంగీత దర్శకుడు మణిశర్మ మాట్లాడుతూ...``దర్శకుడు ఒక మంచి కథతో వచ్చి కలిశారు. మంచి పాటలు చేసే అవకాశం కల్పించిన దర్శకుడు థ్యాంక్స్ చెప్పాలి. నేను ఇంత వరకు చేసిన కంపోజిషన్ లో నాకు ఇష్టమైన పాటలు ఇందులో ఉన్నాయి. నీలకంఠ చక్కటి సాహిత్యాన్ని సమకూర్చారు. నందిత అద్భుతంగా నటించింది`` అన్నారు.
హీరోయిన్ నందిత శ్వేత మాట్లాడుతూ...``డైరక్టర్ కథ చెప్పి...సింగిల్ క్యారక్టర్ అనగానే ... ఈ పాత్ర చేయగలనా అని మొదట భయపడ్డాను. సాహసమే అయినా ఓకే చెప్పాను. ఇలాంటి క్యారక్టర్ చేసే అవకాశం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. నిజంగా ఈ సినిమా చేయడం నా అదృష్టం. డైరక్టర్ గారు చెప్పింది చేసుకుంటూ వెళ్లాను. ఫస్ట్ కాపీ చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యాను. కొత్తగా పెళ్లైన అమ్మాయి..తన భర్త రాక కోసం పడే విరహ వేదనే ఈ చిత్రం. అన్ని ఎమోషన్స్ ఈ పాత్రలో ఉన్నాయి. మణిశర్మ గారి సంగీతం ఈ సినిమాకు ప్రాణం. మా నిర్మాత ఎంతో బాగా చూసుకున్నారు. శివశంకర్ మాస్టర్ గారు కొరియోగ్రఫీ అద్భుతంగా చేశారు. వారు ఇప్పుడు లేకపోవడం బాధాకరం. ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా`` అన్నారు.
నటుడు రాంకీ మాట్లాడుతూ...``ఎంతో గట్స్ ఉంటే కానీ ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేయలేం. నందిత గారు అద్భుతమైన నటన కనబరిచారు. ఒక మంచి సినిమాకు అందరూ సపోర్ట్ చేస్తరు అన్నట్టుగా ఈ చిత్రానికి పెద్ద ఆర్టిస్టులు డబ్బింగ్ చెప్పారు. ఇంత మంచి చిత్రాన్ని మనకు అందిస్తోన్న దర్శక నిర్మాతలను అభినందించి తీరాలి``అన్నారు.