శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 23 జనవరి 2017 (07:48 IST)

చిరు హగ్ చేసుకున్నారు.. బాలయ్య లేచి నమస్కరించారు.. ఈయన వణికిపోయారు..!

రెండు మదగజాలు సంక్రాంతి సందర్బంగా ఢీకొంటుంటే వాటికి మాటల మహత్తునందించి కనీ వినీ ఎరగని హిట్ కావడానికి దోహదపడటం మాటలు కాదు. ఆ మాటల రచయితే బుర్రా సాయి మాధవ్. మనందరికీ తెలిసిన తేలికపదాలతో మాటలల్లి ఆ మాటలతోనే మంత్రముగ్దులను చేస్తున్న సంభాషణల రచయిత సాయి మా

ఒక రచయిత.. రెండు సినిమాలు.. ఒక రచయిత ఇద్దరు స్టార్ హీరోలు. ఒక రచయిత రెండు వైవిధ్యపూరిత కథలు. రెండు మదగజాలు సంక్రాంతి సందర్బంగా ఢీకొంటుంటే వాటికి మాటల మహత్తునందించి కనీ వినీ ఎరగని హిట్ కావడానికి దోహదపడటం మాటలు కాదు. ఆ మాటల రచయితే బుర్రా సాయి మాధవ్. మనందరికీ తెలిసిన తేలికపదాలతో మాటలల్లి ఆ మాటలతోనే మంత్రముగ్దులను చేస్తున్న సంభాషణల రచయిత సాయి మాధవ్. మాటలతో వశీకరించుకునే రచయితలు తెలుగు చిత్ర సీమలో చాలామందే ఉండవచ్చు కానీ వర్ధమాన సినీరచయితల్లో స్టార్ రైటర్ ఆయన. విడుదలైన తర్వాత అంత పెద్ద హీరోలే తనను కౌగలించుకుని మా సినిమాలకు మీ మాటలు ప్లస్ అయ్యాయని ప్రశంసిస్తుంటే.. చేతులెత్తి నమస్కరిస్తుంటే.. జన్మసార్థకమైన అనుభూతి. వాళ్ల సినిమాలకు ఒక్క డైలాగ్ రాస్తే చాలు అనుకున్న చోటో పూర్తి సినిమాలకు మొత్తంగా సంభాషణలు రాసి మెప్పించి, చరిత్ర సృష్టించినవాడు సాయి మాధవ్.
 
బాహుబలి, భజరంగి బాయిజాన్ సినిమా కథలతో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ 2015లో భారతీయ చిత్ర రంగాన్ని ఒక్క ఊపు ఊపారు. వెంటవెంటనే విడుదలైన ఈ రెండు సినిమాలు కథకుడిగా ఆయన్ను తారాస్థాయికి తీసుకుపోయాయి. ఒక రచయిత రాసిన రెండు సినిమా కథలు భారతీయ సినీ చరిత్రలో అరుదైన కలెక్షన్లను రాబట్టడం సంచలనం కలిగించింది. మళ్లీ ఒక తెలుగు రచయిత 2017లో తన సంభాషణలతో అదరగొట్టారంటే అతిశయోక్తి కాదు. ఆయనే ఖైదీ నెం. 150, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలకు సంభాషణల రచయిత బుర్రా సాయి మాధవ్.
 
మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా, బాలకృష్ణ 100వ సినిమా. ఈ రెంటికీ తానే డైలాగులు రాయడం, అవి అద్భుతమైన విజయాలు సాధించడం జీవితంలోనే ఆనందకరం అంటారు సాయి మాధవ్. సహజంగా ఒకటే ఇండస్ట్రీ హిట్‌ అనిపించుకునే స్థితిలో ఇద్దరు మేటి హీరోల సినిమాలు చరిత్రాత్మక విజయం పొందినప్పుడు ఆ ఆనందాన్ని మాటల్లో కొలవలేమంటారీయన. 
 
కృష్ణం వందే జగద్గురుమ్‌ సినిమాకు మాటలు రాసేటప్పుడే సాయి మాధవ్ స్టామినా అర్థమైన చిత్ర  దర్శకుడు క్రిష్  తర్వాత శాతకర్ణికి మాటలు రాయాలని చెప్పారు. అది ఒక బంపర్ ఆఫర్ అయితే.. శాతకర్ణి సినిమా క్లైమాక్స్ సీను రాసిన రెండో రోజే ఆ సినిమాలోని డైలాగుల పవర్ గురించి ఉప్పందిన చిరంజీవి స్వయంగా ఫోన్ చేసి తన ఖైదీ నెం. 150కి కూడా రాయాలన్నారట. వినాయక్ కథ చెబితే దానిప్రకారం ఎన్ని సీన్లు రాయాలంటే అన్ని రాయండి అని చిరంజీవి అనడంతో ఎగిరి గంతేశారు సాయి మాధవ్. చిరు తన సినిమాకు డైలాగులు రాయాలని పోన్ చేసినప్పుడు వణుకొచ్చిందట. చిరు సినిమాలు చూస్తూ పెరిగిన తరం వాడు కదా మరి. ఒక డైలాగు రాసినా సంతోషమే అనుకున్న చోట పంచభక్ష్య పరమాన్నాలు దొరికిన అనుభవం మరి.
 
ఇదంతా ఒక ఎత్తు అయితే జనవరి 11, 12 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు సినిమాలు సునామీనే సృష్టించాయి. విదేశాల్లో కలెక్షన్ల పంట. స్వదేశంలో రికార్డుల పంట. తొలి ఆటకే ఇవి మామూలు హిట్ కాదు అని అర్థమైపోయింది. మళ్లీ చిరంజీవి ఫోన్ చేశారు. ‘మీ వర్క్‌ చాలా ప్లస్సయింది’ అని చెప్పారు. తర్వాత కలిసినపుడు హగ్‌ చేసుకుని ‘సినిమాలో మీ సిగ్నేచర్‌ కనిపిస్తోంది..’ అన్నపుడు గాల్లో తేలిపోయారు సాయి మాధవ్. తర్వాత బాలకృష్ణ. శాతకర్ణి విడుదల తర్వాత ఎక్కడికెళ్లినా ఆ సినిమా డైలాగులే చెబుతుండటం తెలిసిన విషయమే..
 
ఆనందమేసింది. శాతకర్ణి తర్వాత బాలయ్యబాబు ఎక్కడికెళ్లినా ఆ సినిమా డైలాగులే చెబుతున్నారు. ఒక ఫంక్షన్‌లో వక్తలు మాట్లాడేటప్పుడు సాయి మాధవ్ ప్రస్తావన రాగానే బాలయ్య లేచి నిలబడి నమస్కారం చేశారు. అంత మాటల మాంత్రికుడికీ ఒక్కసారిగా భయమేసిందట. వెంటనే తనూ లేచి నమస్కారం పెట్టాడట. తర్వాత కూడా మనం పనిచేద్దాం అని బాలయ్య అనగానే  జన్మకు సార్థకత అనిపించినంత జగదానందం సాయి మాధవ్‌ది.
 
కళల నిలయం తెనాలిలో పుట్టి రంగస్థల నటులైన అమ్మా నాన్న పెంపకంలో నాటకాలు రాయడం,  నటించడం నేర్చుకున్న సాయి మాధవ్ జీవితం ప్రజానాట్యమండలి, అభ్యుదయ కళాసమితి, అభ్యుదయ రచయితల సంఘం తోడుగా కొనసాగింది.  తర్వాత టీవీ సీరియల్స్‌లో పనిచేస్తున్నప్పుడు దర్శకుడు క్రిష్ పరిచయం. 
 
సాయి మాధవ్ బుర్రా అనే మాటల మహా మాంత్రికుడి సినీ జీవిత ప్రస్థానం అలా మొదలైంది.

నీ కడుపులో పెంచుతున్నది మనిషిని కాదు మారణ హోమాన్ని అంటూ తను రాసిన డైలాగ్ శాతకర్ణి సినిమా మొత్తానికి మూలపదమైంది.

భర్తగా నీకు బొట్టుపెట్టడం లేదు ఒక చరిత్రకు పెడుతున్నా అని వాశిష్టి దేవి నోట పలికించడంతో పుట్టే ఎఫెక్టు థియేటర్లోకి పోయి చూస్తేనే అర్థమవుతుంది.

శాతకర్ణి తన పేరుకు ముందు గౌతమీపుత్ర అని ఎందుకు పెట్టుకున్నాడో సినిమాలో కథ చూస్తుంటే, బాలకృష్ణ నోట సాయి మాధవ్ డైలాగులు వింటుంటే రోమాంచితభావన. 
 
"ఈ ప్రపంచానికి నా మాటగా చెప్పు, ఈ దేశం ఉమ్మడి కుటుంబం. గదికీ గదికీ మధ్య గోడలుంటాయి. గొడవలుంటాయి. ఈ ఇల్లు నాదంటే నాదని కొట్టుకుంటాం. కానీ, ఎవడో వచ్చి నా ఇల్లంటే ఎగరేసి నరుకుతాం. సరిహద్దుల్లోనే మీకో శ్మశానం నిర్మిస్తాం. మీ మొండేల మీద మా జెండా ఎగరేస్తాం."
 
"దొరికినవాళ్లని తురుముదాం.. దొరకనివాళ్లని తరుముదాం.."
 
నిజమే కదా మరి.  ఆ సంభాషణలు ప్రాస కోసం పాకులాడవు. పంచ్‌ల పదబంధాల్లోకి వెళ్లవు. సులువుగా అందరికీ అర్థమయ్యేలా ఉంటాయి. సన్నివేశం, సందర్భానికి తగినట్టుగా ప్రేక్షకుల్ని తీసుకెళ్తాయి. యుద్ధ సన్నివేశమైతే తూటాల్లా పేలతాయి. శత్రువుతో మాటల యుద్ధంలో భాస్వరంలా మండి అగ్గిని రగిలిస్తాయి. ప్రేమావిష్కరణలో గిలిగింతలు పెడతాయి. అమ్మ గురించి చెబితే మనసు పొరల్లోంచి ఆర్ద్రత పొంగుకొస్తుంది. జీవన తాత్వికత కొట్టొచ్చినట్టు గోచరిస్తుంది. 
 
అవును.. తెలుగు మాట, తెలుగు వాడి వేడి రూపు దాల్చిన నిక్కమైన అక్షరం సాయిమాధవ్..