ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 26 నవంబరు 2024 (16:29 IST)

నటుడు సోనూసూద్ కు సంకల్ప్ కిరణ్ పురస్కారం

Sankalp Kiran award to actor Sonusood
Sankalp Kiran award to actor Sonusood
సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 28వ తేదీన 'సంకల్ప్ దివాస్' కార్యక్రమం జరగనుంది. మానవతావాది, వ్యాపారవేత్త లయన్ డాక్టర్ వై. కిరణ్, ప్రతి సంవత్సరం నవంబర్ 28న 'సంకల్ప్ దివాస్'ను నిర్వహిస్తున్నారు. అదే ఆనవాయితీని ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నారు. 
 
సమాజ సేవే లక్ష్యంగా 'సుచిరిండియా ఫౌండేషన్'ను స్థాపించింది సుచిరిండియా గ్రూప్. ఈ సంస్థ ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తూ, సమాజానికి తమ వంతు సేవ చేస్తుంది. అలాగే సమాజానికి విశేష సేవ చేస్తున్న ప్రముఖులని గుర్తించి, వారిని సత్కర్తించడంలోనూ సుచిరిండియా ఫౌండేషన్ ముందుంటుంది. సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే 'సంకల్ప్ దివాస్'కి ఎంతో విశిష్టత ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రముఖుల సేవలను గుర్తించి వారిని 'సంకల్ప్ కిరణ్ పురస్కారం'తో సత్కరిస్తుంటారు. 
 
దాదాపు రెండు దశాబ్దాలుగా, ప్రతి ఏడాది గొప్ప మానవతావాదులను గుర్తించి వారిని సత్కరిస్తున్నారు. వారిలో అన్నా హజారే, కిరణ్ బేడీ, సుందర్‌లాల్ బహుగుణ, సందీప్ పాండే, జోకిన్ అర్పుతం, మేరీ కోమ్ వంటి ఎందరో ప్రముఖులు ఉన్నారు. ఈ సంవత్సరం 'సంకల్ప్ దివాస్'లో ప్రముఖ నటుడు సోనూసూద్ ను 'సంకల్ప్ కిరణ్ పురస్కారం'తో సత్కరించనున్నారు. నవంబర్ 28వ తేదీన సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్, లలితా కళాతోరణంలో భారత్-బల్గేరియా రాయబార కార్యాలయ అంబాసిడర్ హెచ్.ఈ. నికోలాయ్ యాంకోవ్ ముఖ్య అతిథిగా 'సంకల్ప్ దివాస్' కార్యక్రమం ఘనంగా జరగనుంది.
 
లయన్ డాక్టర్ వై. కిరణ్ గారి ప్రతి ఆలోచన, ప్రతి అడుగు సమాజ సేవ గురించే ఉంటుంది. ఆయన ఆలోచన నుంచి పుట్టినదే 'సంకల్ప్ దివాస్'. 'సుచిరిండియా ఫౌండేషన్' తలపెట్టిన 'సంకల్ప్ దివాస్' కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.. ఆపదలో ఉన్న వారిని ఆదుకొని, వారికి మెరుగైన జీవితాన్ని అందించడం. ప్రస్తుత ఆకలిని తీర్చే నిత్యావసర వస్తువులను అందించడం మొదలుకొని, భవిష్యత్ కి బాటలు వేసే వస్తులను అందించడం వరకు 'సంకల్ప్ దివాస్' చేస్తోంది. అనాథ పిల్లలను, బాల కార్మికులను, పేద విద్యార్థులను గుర్తించి వారి చదువుకి కావాల్సిన సహాయసహకారాలను అందిస్తుంది. దివ్యాంగులకు అవసరమైన పరికరాలను అందించి, వారు వైకల్యాన్ని అధిగమించి జీవితంలో ముందుకు అడుగులు వేసేలా అండగా నిలబడుతుంది. ఒంటరి పేద మహిళలకు కుట్టు మిషన్లు లేదా ఇతర ఉపయోగకర యంత్రాలను అందిస్తుంది.

అలాగే వారు రూపొందించిన వస్తువులు, నేసిన వస్త్రాలను వారే స్వయంగా విక్రయించుకునే విధంగా ఎగ్జిబిషన్ లను వంటివి ఏర్పాటు చేసి, వారిని చిరు వ్యాపారులుగా తీర్చిదిద్దుతుంది. ఇలా కేవలం సహాయం చేసి చేతులు దులుపుకోకుండా, వారికి అడుగడుగునా అండగా నిలుస్తూ, మెరుగైన జీవితాన్ని అందిస్తుంది సంకల్ప్ దివాస్. అలాగే ప్రముఖుల సేవలను గుర్తించి వారిని సత్కరించడం ద్వారా, సమాజానికి సేవ చేయాలనే ఆలోచనను మరెందరికో కలిగేలా చేస్తోంది.