మంగళవారం, 8 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 జులై 2025 (15:04 IST)

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

court
తనకు కేన్సర్ సోకిందని, తాను ఎక్కువ కాలం జీవించలేనని నమ్మించి కొందరు అతిథులను ఇంటికి పిలిపించిన ఓ మహిళ డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో హత్యచేసింది. ఈ దారుణానికి పాల్పడిన ఓ మహిళను ఆస్ట్రేలియా కోర్టు దోషిగా తేల్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే
 
2023 జూలైలో మెల్‌బోర్న్‌కు 110 కిలోమీటర్ల దూరంలోని లియోన్ గాథ పట్టణంలో ఉన్న తన నివాసంలో ఎరిన్ ప్యాటర్సన్ అనే మహిళ ఓ విందును ఏర్పాటుచేసింది. ఈ విందుకు హాజరైన ఆమె భర్త, తల్లిదండ్రులు డాన్, గేల్ ప్యాటర్సన్‌తో పాటు గేల్ సోదరి హీథర్ విల్కిన్సన్‌ ఆ ఆహారం తిన్న కొద్ది రోజులకే మరణించారు. హీథర్ భర్త ఇయాన్ విల్కిన్సన్ మాత్రం తీవ్ర అస్వస్థతకు లోనై, ఆస్పత్రిలో చేరి కొన్ని వారాల పాటు చికిత్స పొంది ప్రాణాలతో బయటపడ్డాడు.
 
ఈ కేసు విచారణ దాదాపు పది వారాల పాటు సాగింది. ఈ సందర్భంగా ప్రాసిక్యూషన్ కీలక వాదనలు వినిపించింది. ఎరిన్ ఉద్దేశ్యపూర్వకంగా అత్యంత ప్రమాదకరమైన డెత్ క్యాప్ పుట్టగొడుగులను సేకరించి, వాటిని ఎండబెట్టి పొడిగా మార్చిందని ఆరోపించింది. ఆ పొడిని బీఫ్ వెల్లింగ్‌టన్ అనే వంటకంలో కలిపి అతిథులకు వడ్డించిందని జ్యూరీకి వివరించింది. 
 
అంతేకాకుండా తనకు కేన్సర్ ఉందని అబద్దం చెప్పి వారిని విందుకు ఆహ్వానించింది. అనుమానం రాకుడా ఉండేందుకు తనక్కూడా ఆ ఆహారం వల్ల అనారోగ్యం వచ్చినట్టు నటించిందని, పోలీసుల విచారణ మొదలుకాగానే సాక్ష్యాలను నాశనం చేసిందని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. 
 
అయితే, ఈ ఆరోపణలను ఎరిన్ ఖండించింది. తాను నిర్దోషినని, పొరపాటున మాత్రమే విషపు పుట్టగొడుగులు వంటలో కలిసిపోయాయని వాదించింది. జ్యూరీ సుధీర్ఘ విచారణ తర్వాత ఆమె దోషిగా తేల్చింది. త్వరలోనే న్యాయస్థానం ఆమెకు శిక్షను ఖరారుచేయనుంది.