మాలి దేశంలో పెట్రేగిన ఉగ్రవాదులు - ఏపీ కార్మికుడు కిడ్నాప్
వెస్ట్రన్ ఆఫ్రికా దేశమైన మాలిలో ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయాడు. ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న ముగ్గురు భారతీయులను కిడ్నాప్ చేశారు. బాధితులలో ఏపీకి చెందిన కూరాకుల అమరలింగేశ్వరరావు కూడా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్‌లో నివాసం ఉంటున్న ఆయన కుటుంబం.. తమ కుటుంబ పెద్దను రక్షించాలని వారు కేంద్ర జి.కిషన్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించింది.
ఈ విషయంపై కిషన్ రెడ్డి తక్షణమే స్పందించారు. మాలిలోని భారత రాయబార కార్యాలయంతో మాట్లాడి, బాధితులను విడిపించేందుకు వేగంగా చర్యలు చేపట్టాలని కేంద్ర విదేశాంగ శాఖకు లేఖ రాశారు. ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల మండలం జమ్మలమడకకు చెందిన అమరలింగేశ్వరరావు 11 ఏళ్లుగా మాలిలోని డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. హైదరాబాద్ కొండాపూర్‌లోని ప్రసాదిత్య కంపెనీ ద్వారా ఆయన అక్కడికి వెళ్లారు.
అమరలింగేశ్వరరావుతో పాటు కిడ్నాపు గురైన వారిలో ఒడిశాకు చెందిన పి.వెంకటరమణ, రాజస్థాన్‌కు చెందిన ప్రసాద్ ఉన్నట్టు తెలిసింది. జులై 1న బైక్‌పై వచ్చిన సాయుధ మిలిటెంట్లు, ఫ్యాక్టరీ ప్రాంగణంలోకి చొరబడి ముగ్గురినీ అపహరించుకుపోయారు. ఈ కిడ్నాప్ వెనుక తమ హస్తం ఉందని అల్ ఖైదా అనుబంధ సంస్థ 'జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం వాల్ ముస్లిమీన్' (జేఎస్ఐఎం) ప్రకటించుకుంది.
అయితే, ఘటన జరిగి నాలుగు రోజులు గడిచినా అల్ ఖైద్వా ప్రేరేపిత ఉగ్రవాదుల నుంచి ఎలాంటి డిమాండ్లు రాకపోవడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. మరోవైపు, ఒడిశాకు చెందిన వెంకటరమణను కాపాడాలంటూ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్కు విజ్ఞప్తి చేశారు.