జమీందారీ వ్యవస్థకు అద్దంపట్టిన ‘బాటసారి’కి అరవై ఏళ్ళు
“ఓ బాటసారీ… నను మరువకోయి…”, “కనులకు దోచి చేతికందని ఎండమావులుంటయ్..”, “లోకమెరుగని బాలా…” అనే పాటలతో జీవితాన్ని ఆవిష్కరించిన సినిమా `బాటసారి`. నేటికి జూన్ 30న విడుదలై సరిగ్గా అరవై ఏళ్ళు పూర్తిచేసుకుంది. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు నటన చెప్పుకోదగింది. భానుమతి అతనికి ధీటుగా నటించింది. ఈ సినిమాను ఆమె స్వంత నిర్మాణ సంస్థలోనే నిర్మించింది. ఆమె బర్త పి. రామకృష్ణ నెలకొల్పిన భరణీ సంస్థపై రూపొందింది. ఈ సినిమాకు దర్శకుడు రామకృష్ణ.
దేవదాసు సినిమాలో భగ్నప్రేమికుడిగా నాగేశ్వరరావు నటించాడు. ఇక బాటసారిలో మరో కోణంలో నటించాడు. ఇందుకు కథలోని అంశమే కీలకం. శరత్ చంద్ర ఛటర్జీ రాసిన బడా దీదీ బెంగాలీ నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రం బాటసారి. తాను నటించిన చిత్రాలలో తన మనసును బాగా హత్తుకున్న చిత్రం బాటసారి అని అక్కినేని అనేక సార్లు చెప్పారు. 1961 జూన్ 30న విడుదలైన బాటసారి చిత్రం తమిళంలో కానల్ నీర్ పేరుతో రూపొందింది. గృహలక్ష్మి మినహాయిస్తే ఏయన్నార్ తో భరణీ సంస్థ నిర్మించిన చిత్రాలన్నీ తమిళంలోనూ ఏకకాలంలో నిర్మితమయ్యాయి. రెండు భాషల్లోనూ ఏయన్నార్, భానుమతి నాయకానాయికలుగా నటించేవారు. అదే తీరున బాటసారి కూడా తమిళ జనం ముందు నిలచింది.
కథ ప్రకారంగా చూసుకుంటే, అప్పటి జమీందారీ వ్యవస్థ. చదవురాని కొడుకు, ఓ బాలవితంతువు చదవు చెప్పడానికి జమీందారి ఇంటికి రావడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అప్పటి వర్తమాన కాలానికి అనుగుణంగా దర్శకుడు మలిచారు. ఇందులో షావుకారు జానకి, ముదిగొండ లింగమూర్తి, రమణమూర్తి, వంగర, బి.ఆర్.పంతులు, దేవిక, సూర్యకాంతం, ఎల్.విజయలక్ష్మి, లక్ష్మీరాజ్యం నటించారు. ఈ చిత్రానికి సముద్రాల వేంకటరాఘవాచార్య మాటలు, పాటలు పలికించగా, మాస్టర్ వేణు సంగీతం సమకూర్చారు.