డిజిటల్ మీడియాకు షాక్ ఇచ్చిన తెలుగు నిర్మాతలు
థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య నానాటికీ తగ్గిపోతున్న ప్రస్తుత పరిస్థితులలో... సినిమా విడుదలైన నెల రోజులలోనే అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, జియోలాంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులోకి వచ్చేస్తూండటంతో థియేటర్లలో సినిమా చూసేందుకు ఆ కొద్ది మంది ప్రేక్షకులు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదంటే అతిశయోక్తి కాదు.
ప్రస్తుతానికి డిజిటల్ మీడియా ద్వారా నిర్మాతలకు మంచి లాభాలే వస్తున్నప్పటికీ... భవిష్యత్తులో వీటి కారణంగా థియేటర్ల మనుగడతోపాటు వాటిని నమ్ముకొని బ్రతుకుతున్న కార్మికుల జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందన్న వాదన బలంగా వినపడుతుంది.
ఈ కారణంగా, ఈ విషయంపై నిర్మాతల మండలి పెద్దలు ఓ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏప్రిల్ 1వ తేదీ నుండి ఏ సినిమా అయినా విడుదలైన 8 వారాల వరకు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రదర్శింపబడకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టుగా ఈ సందర్భంగా వారు తెలియజేసారు.
అయితే ఈ నిర్ణయంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. భారీ సినిమాలు, హిట్ సినిమాలకు ఈ నిర్ణయం మేలు కలిగించినప్పటికీ... చిన్న సినిమాలు, ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాలకు ఈ నిర్ణయంతో నష్టాలు పెరిగే అవకాశం ఉందని కొందరు వాదిస్తున్నారు.
ఇప్పటికే... 'మా' అధ్యక్ష ఎన్నికల పేరిట రోడ్డున పడ్డ తెలుగు సినీ పరిశ్రమ... ఈ నిర్మాతల మండలి నిర్ణయాలలో ఎంత మేరకు ఏకీభవిస్తారో... ఇది దేనికి దారి తీస్తుందో... అదీ చూద్దాం.