శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Modified: బుధవారం, 27 జనవరి 2021 (12:21 IST)

అలాంటివారే స్టార్ దర్శకులు అయ్యారుః శివనాగు

Sivanagu,Director
ఉమ్మడి కుటుంబాల్లోని అనుబంధాలు, ఆప్యాయతలను ఆవిష్కరిస్తూ, స్వచ్ఛమైన పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ "అన్నపూర్ణమ్మ గారి మనవడు" చిత్రాన్ని మలచడం జరిగిందని ఆ చిత్ర దర్శకుడు నర్రా శివ నాగేశ్వరరావు (శివనాగు) వెల్లడించారు. 
సీనియర్ నటి అన్నపూర్ణమ్మ నాయనమ్మ గా,  మాస్టర్ రవితేజ మనవడిగా టైటిల్ పాత్రలు పోషించిన చిత్రమిది. హీరో హీరోయిన్లుగా బాలాదిత్య, అర్చన నటించగా, ఓ కీలక పాత్రలో సీనియర్ నటి జమున నటించారు.
ఎం.ఎన్.ఆర్. ఫిలిమ్స్ పతాకంపై ఎం.ఎన్.ఆర్.చౌదరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా  హైదరాబాద్ లో దర్శకుడు నర్రా శివ నాగేశ్వరరావు (శివనాగు) పాత్రికేయులతో కొద్దిసేపు ముచ్చటించారు.
"ఉమ్మడి కుటుంబాలకు సంబంధించిన మంచి గ్రామీణ కథ ఇది. ఇంకా చెప్పాలంటే ప్రతిఒక్కరి జీవితానికి అన్వయించుకునే కథ. ఇందులో మిర్యాలగూడ అమ్మాయి ప్రేమకథ కూడా మిళితమై ఉంటుంది. ఆ అమ్మాయి ప్రేమ వివాహానికి తండ్రి అంగీకరించని నేపథ్యంలో ఎదురయ్యే పరిణామాలను ఈ చిత్రంలో చూపించాం. ప్రేమికులుగా బాలాదిత్య, అర్చన అద్భుతంగా నటించారు. అక్కినేని అన్నపూర్ణమ్మ పాత్రలో అన్నపూర్ణమ్మ అద్భుతమైన నటన ను పలికించారు. సీనియర్ నటి జమున అక్కినేని అనసూయమ్మగా అలరిస్తారు. మాస్టర్ రవితేజ కొత్త కుర్రవాడు అయినప్పటికీ అనుభవం ఉన్న నటుడిగా మనవడి పాత్రలో ఒదిగిపోయాడు. పాత్రలకు సరిపోయే సీనియర్ నటీ నటులు బెనర్జీ, శ్రీలక్ష్మి, ప్రభ, జయంతి, సుధ, సంగీత, రఘబాబు, తాగుబోతు రమేష్, సుమన్ శెట్టి తదితరులను ఎంపికచేసుకుని ఈ చిత్రం తీశాం. 
కాగా కరోనా కారణంగా ధియేటర్స్ మూతపడటంతో ముందుగా ఈ చిత్రాన్ని ఇండియాలో కాకుండా   ఓవర్సీస్ లో మాత్రమే అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల చేశాం.  విదేశాలలో విశేషమైన స్పందన లభించింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో థియేటర్స్ ఓపెన్ అవడంతో 29న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. నిర్మాత ఎం.ఎన్.ఆర్.చౌదరి అభిరుచితో పాటు బడ్జెట్ పరంగా రాజీపడని మనస్తత్వం కారణంగా ఈ చిత్రాన్ని చాలా బాగా తీయగలిగాను. కెరీర్ పరంగా నాకిది 11వ చిత్రం. ఎలాంటి కథను ఎంచుకున్నా అది ప్రేక్షకుడికి నచ్చేలా ఉండాలి. అలాంటి సినిమా లను అన్ని వయసుల వారు ఆదరిస్తారు. నేను తీసిన ఈ సినిమా యూత్ తో పాటు ఇంటిల్లపాది చూసేలా ఉంటుంది. నా దృష్టిలో అన్ని తరగతుల ప్రేక్షకులు నచ్చే సినిమాలను తీసిన దర్శకులే స్టార్ దర్శకులు అయ్యారు. ఈ చిత్రం తర్వాత నేను తీసిన మరో చిత్రం "దేవినేని" కూడా పూర్తయింది. ఇంకా వేరే కొత్త  ప్రాజెక్టులకు సన్నాహాలు జరుగుతున్నాయి" అంటూ ఇంటర్వ్యూ ముగించారు.