సూర్యాస్తమయం సినిమా దర్శక నిర్మాతలు ఒకరిపై ఒకరు నిందలు
సినిమాకు దర్శకుడు, నిర్మాత భార్యాభర్తలు అని సినీపరిశ్రమ నానుడి. సినిమా బాగారావాలంటే ఇద్దరూ సరైన పట్టాలపై పయనించాలి. గాడి తప్పితే ఇదిగో ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు, నిందలు, సవాల్, ప్రతిసవాల్‌గా మారిపోతుంది. వీరి గొడవను మీడియాను బ్రిడ్జిగా చేసుకుని ఒకరిపైఒకరు నిందలు వేసుకుంటూనే వున్నారు. ఫైనల్‌గా మంగళవారంనాడు సూర్యాస్తమయం నిర్మాత దర్శకుడిపై వార్ ప్రకటించారు.
నిర్మాత రఘు మాట్లాడుతూ, మా సూర్యాస్తమయం దర్శకుడు బండి సరోజ్ కుమార్ సినిమా గురించి చాలా రకాలుగా మాట్లాడుతున్నాడు, సినిమా లో తన పాత్ర నిడివి తగ్గించారని తను బాగా తీసిన సీన్స్ కట్ చేసారని బయట ప్రచారం చేస్తున్నాడు. అలా ఎందుకు చేస్తారని నేను అడుగుతున్నా. కేవలం నిడివి ఎక్కువయిందని బోరింగ్ సీన్స్‌ను తీసేశాం. ఈ విషయంపై నటీనటులు మాట్లాడడానికి వస్తే మీరు ఇటీవల మీడియా ముందే గొడవకు దిగావ్. పైగా మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నావ్. నువ్వే డైరెక్టర్, నువ్వే హీరో, అన్నింట్లో నువ్వు తల దూర్చినా మేము ఏమి మాట్లాడలేదు, సినిమా ప్రొమోషన్స్ కి రావు. నీతో ఇకపై సినిమాలు ఎవరుతీస్తారనుకున్నావ్.
నువ్వు మా సినిమా తీసి యూట్యూబ్ లో పెట్టి వంద రూపాయలు తీసుకుంటావు అంటే నువ్వు ఒక్కడివే బావుండాలి మిగతా వాళ్లంతా బావుండనవసరం లేదా బండి సరోజ్ ఒకటి గుర్తు పెట్టుకో మేము ఎంత మంచి వాళ్ళమో నీకు తెలుసు ఇకపై అయిన మంచి ప్రవర్తన తో ప్రవర్తించు అని ప్రొడ్యూసర్ రఘు హెచ్చరించారు.
అసలేం జరిగిదంటే, సినిమా విడుదలకు ముందు సెన్సార్‌కట్ పేరుతో కొన్ని సన్నివేశాలు నిర్మాత తొలగించారు. తనకు తెలీకుండా ఇలా చేయడం తగదని దర్శకుడు వాపోయాడు. అనంతరం ప్రతిచర్యగా ఆ సినిమాను విడుదలరోజే దర్శకుడు యూట్యూబ్‌లో పెట్టుకుని సొమ్ము చేసుకున్నాడు.