రఘురామపై అనర్హత వేటు వేయకపోతే పార్లమెంట్ స్థంభనే
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎంపీ రఘరామ కృష్ణం రాజుపై వేటు వేయకపోతే,
పార్లమెంట్‌ను స్తంభింప చేస్తాం అని పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. రఘురామను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ, ఏడాది క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ స్పీకర్ వద్ద దాఖలు చేసిన పిటిషన్ ఇంత వరకు తేల్చకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్పీకర్ ఓం బిర్లా సూచించిన విధంగా అనర్హత పిటిషన్‌లో మార్పులు చేర్పులు చేసి వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేశామన్నారు. రఘురామ కృష్ణంరాజు ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అసభ్య పదజాలంతో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన అదనపు సాక్ష్యాధారాలను స్పీకర్‌కు సమర్పించామన్నారు.
ఒక వేళ స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించకపోతే, పార్లమెంట్‌లో తమ పార్టీ సభ్యులంతా ఆందోళనకు దిగుతామని ఆయనకు చెప్పడం జరిగిందన్నారు. సంబంధిత సభ్యుడికి 15 రోజుల గడువుతో నోటీసు జారీ చేసి అనంతరం ఈ పిటిషన్‌ను ప్రివిలేజస్ కమిటీకి పంపిస్తామని స్పీకర్ ఓంబిర్లా చెప్పారన్నారు. దీనిపై స్పీకర్‌కు తమ వ్యతిరేకతను తెలిపినట్లు విజయసాయి రెడ్డి చెప్పారు.
అనర్హత పిటిషన్ దాఖలు చేసిన ఆరు మాసాలలోగా స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించాలని, గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను స్పీకర్ దృష్టికి తీసుకెళ్ళామని విజయసాయి చెప్పారు. గతంలో లోక్ సభ స్పీకర్లుగా వ్యవహరించిన రబీరే, సోమనాధ్ చటర్జీ వంటి వారు అనర్హత పిటిషన్లను ప్రివిలేజెస్ కమిటీకి పంపించకుండా తామే తుది నిర్ణయం తీసుకున్న దాఖలాలు ఉన్నాయన్నారు.
ఇక్కడ సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడింది రఘురామ కృష్ణంరాజు. బాధితుడు ఆయన కాదు, మేము. అలాంటప్పుడు పిటిషన్‌ను ప్రివిలేజెస్ కమిటీకి పంపించడంలో ఔచిత్యం లేదని స్పీకర్‌కు స్పష్టం చేసినట్లు తెలిపారు. స్పీకర్ తగు నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తే త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాలలో అవసరమైతే పార్లమెంట్‌ను స్తంభింపచేయడానికి కూడా తాము వెనుకాడబోమని స్పీకర్‌కు స్పష్టం చేసినట్లు తెలిపారు.