డ్రగ్ ఫెస్టివల్ పేరుతో సినీనటులతో ఫ్యాషన్ పరేడ్‌లు పెట్టారు : పూరి జగన్నాథ్
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలు, ఘోరాలపై ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ముఖ్యంగా, ప్రతి 15 నిమిషాలకో అత్యాచారం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రోజూ వంద అత్యాచారాలు జరుగుతున్నాయనీ, అలాగే, ప్రతి రోజూ దాదాపు 4 లక్షలకు పైగా దాడులు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ నగరంలో దిశకు జరిగిన న్యాయమే అన్యాయానికి గురైన ప్రతి మహిళకు జరగాలని ఆయన ఆకాంక్షించారు.
ఇదే అంశంపై ఆయన ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులపై మనసువిప్పి మాట్లాడారు. ఆగస్టు 15న దేశం స్వాతంత్య్రదినోత్సవం జరుపుకుంటుంటే, మరోవైపు ఓ ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేశారని, ఇది ఎవరికైనా తెలుసా? అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం ఇప్పుడు దేశంలో డ్రగ్స్ ఫెస్టివల్ కొనసాగుతోందని, సినీనటులను తీసుకువెళ్లి ఫ్యాషన్ పరేడ్‌లు పెట్టారన్నారు.
భారత్, చైనా సరిహద్దుల్లోని గాల్వాన్ వ్యాలీలో దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల పేర్లు ఎవరికీ తెలియదని, ఆ మహావీరుల గురించి ఆలోచించారా? అని ఆయన ప్రశ్నించారు. అనంతరం దేశంలో బంధుప్రీతి ఫెస్టివల్ జరిగిందని, ఆ విషయంపై మాట్లాడుకున్నారని తెలిపారు. నటులను అణచివేస్తున్నారని మాట్లాడుకోవడం ఓ అవివేకమని ఆయన చెప్పారు.
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఒక స్టార్ అని, కొత్త హీరోల సినిమాలు ఎన్నో విడుదలవుతుంటాయన్నారు. వారి సినిమాలు విడుదలైనప్పుడు ఒక్క థియేటరైనా నిండిందా? అని ఆయన ప్రశ్నించారు. అయితే, ఆ కొత్త హీరోలను ప్రోత్సహిద్దామని ప్రేక్షకులు టిక్కెట్ కొన్నారా? అని ఆయన నిలదీశారు. ప్రేక్షకులు చివరికి స్టార్స్ సినిమాలే చూస్తారని పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా, దేశంలో ప్రతి 15 నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి రోజు 100 అత్యాచార కేసులు నమోదు అవుతున్నాయని, మహిళలపై ప్రతి రోజు దాదాపు 4 లక్షలపైగా దాడులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. హత్రాస్‌లో నిందితులు అత్యాచారం చేయడమేకాకుండా దారుణంగా ఆమెను హింసించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు అన్యాయం జరిగితే న్యాయం కోసం పోరాటం చేయాల్సి వస్తోందని పూరీ అన్నారు.