శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (15:19 IST)

బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తెలుగు డైరెక్టర్స్ ఫైట్..

గతంలో ఎంతో మంది తెలుగు దర్శకులు బాలీవుడ్‌లో చిత్రాలను తీసి భారీ హిట్‌లు అందుకున్న వాళ్లు ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో బాలీవుడ్ చిత్రపరిశ్రమ మొత్తం తెలుగు సినిమాలు, తెలుగు దర్శకుల వైపు ఆశగా ఎదురుచూస్తోంది.


తెలుగులో సినిమా హిట్ అయ్యిందంటే, ఆ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి బాలీవుడ్ నిర్మాతలు తెగ ట్రై చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇద్దరు తెలుగు డైరెక్టర్స్ మధ్య ఓ చిన్నపాటి బాక్సాఫీస్ యుద్ధం త్వరలో జరగబోతోంది. 
 
2011లో వచ్చిన అనగనగా ఓ ధీరుడు సినిమాకి మొదటిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి, ఆ సినిమాతో హిట్ అందుకోలేక చతికిలపడ్డాడు. అయితే ఆ తర్వాత 2015లో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన సైజ్ జీరో సినిమాతో మరోసారి తన లక్‌ని పరీక్షించుకున్నాడు. ఆ సినిమా ఫర్వాలేదనిపించడంతో ఇప్పుడు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌తో మెంటల్ హై క్యా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం జూన్ 21వ తేదీన విడుదలకు సిద్ధమవుతుంది.
 
మరోవైపు తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాతో సంచలన దర్శకుడుగా మారిన సందీప్ వంగా, ఆ చిత్ర సక్సెస్‌తో బాలీవుడ్‌ని సైతం కట్టిపడేశాడు. అందుకే ఈ చిత్రాన్ని ఇప్పుడు షాహిద్ కపూర్ లీడ్ రోల్‌లో కబీర్ సింగ్ పేరుతో సినిమా చేస్తున్నాడు. అలాగే ఇందులో అందాల భామ కియరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. 
 
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రం కూడా జూన్ 21వ తేదీనే విడుదల కానుంది. కాగా ఇద్దరు తెలుగు దర్శకులు తీసిన చిత్రాలు ఒకే రోజు విడుదల కానుండడంతో బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ నెలకొంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.