శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 28 డిశెంబరు 2020 (16:14 IST)

కాజ‌ల్‌కు పేరొచ్చింది.. నాకు డ‌బ్బులు పోయాయి : సి.క‌ళ్యాణ్‌

'చందమామ' అనే సినిమా నా కెరీర్‌లో బాగా పేరు తెచ్చిన సినిమా. ఓవ‌ర్‌సీస్‌తో స‌హా అన్ని చోట్ల నాకు మంచి సినిమా తీశావ‌నే పేరు వ‌చ్చింది. అందులో న‌టించిన మా చందమామ కాజల్ అగర్వాల్ ఎంత స్టార్ అయ్యిందో మీకు తెలుసు. చాలామందికి పేరు తెచ్చింది. సినిమా బాగానే ఆడింది. కానీ నాకు డ‌బ్బులు మాత్రం రాలేదు. సినిమా ప‌రిశ్ర‌మ‌లో డ‌బ్బ‌ులు రాక‌పోయినా.. సినిమాలు తీస్తుంటూనేవుంటాను. అందులో వున్న కిక్ వేరు అని ప్రముఖ నిర్మాత సి. క‌ళ్యాణ్ అంటున్నారు. 
 
గురు రాఘవేంద్ర సమర్పణలో హరి వల్లభ ఆర్ట్స్ పతాకంపై దర్శకుడు ఆనంద్ కానుమోలు రూపొందించిన సినిమా ''తొంగి తొంగి చూడమాకు చందమామ''. ఈ చిత్రానికి ఎ. మోహన్ రెడ్డి నిర్మాత. దిలీప్, శ్రావణి హీరో హీరోయిన్‌లుగా నటించారు. లవ్, రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ''తొంగి తొంగి చూడమాకు చందమామ'' సినిమా ట్రైలర్‌, ఆడియో రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. 
 
ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై ఆడియోను విడుదల చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత ఆయన సినిమా గురించి చెబుతూ.. ఈ సినిమా పేరులో కూడా చందమామ ఉంది. చందమామ సినిమాతో నాకు పేరొచ్చింది కానీ డబ్బులు రాలేదు. ఇండస్ట్రీలో ఎక్కువ డబ్బులు పోగొట్టుకున్న నిర్మాత నేనే కావొచ్చు. అయితే ''తొంగి తొంగి చూడమాకు చందమామ'' సినిమా మంచి హిట్ అయి సినిమా యూనిట్‌కు పేరుతో పాటు నిర్మాతకు బాగా డబ్బులు తీసుకురావాలని కోరుకుంటున్నానన్నారు.
 
చిత్ర నిర్మాత మోహన్ రెడ్డి మాట్లాడుతూ, పూర్తిస్థాయి కుటుంబ చిత్రమిది. మేము కథను అనుకున్నట్లు సినిమా బాగా వచ్చింది. జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. సినిమా అందరికీ నచ్చే విధంగా ఉంటుంది అని అన్నారు.
 
దర్శకుడు ఆనంద్ కానుమోలు మాట్లాడుతూ, ఇష్టమైనవి దక్కాలంటే ముందు మనం దానిని ప్రేమించాలి. అది దక్కిందా లేదా అనేది తర్వాత విషయం. కానీ అలా ప్రేమిస్తే వాళ్ల విలువ మనకు తెలుస్తుంది అని చెప్పే చిత్రమిది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందించాము. ఈ మూవీ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. అక్క, తమ్ముడు, బావ ఇలా ప్రతి రిలేషన్‌తో పోల్చుకునేలా ఉంటుంది. అందరి జీవితాల్లో కనిపించే సన్నివేశాలు, అనుబంధాలు ఉంటాయి. జనవరి 2021లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. విడుదల తేది త్వరలో తెలియజేస్తాము అని అన్నారు.
 
హీరో దిలీప్ మాట్లాడుతూ, ఈ మూవీ కోసం మేమంతా చాలా కాన్ఫిడెంట్‌గా ఎదురుచూస్తున్నాం. కరోనా వచ్చి మా ఆశలపై నీళ్లు చల్లింది. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టింది అన్ని థియేటర్లు ఓపెన్ అయితే మా సినిమా విడుదల చేయాలని మా దర్శక, నిర్మాతలు ప్లాన్ చేశారు. కానీ కరోనా భయంతో ఇప్పటికీ పూర్తిగా థియేటర్లు ఓపెన్ కానందున త్వరలో సరైన డేట్‌తో ఈ జనవరిలోనే మీ ముందుకు రావాలనుకుంటున్నాం. మా ''తొంగి తొంగి చూడమాకు చందమామ'' చిత్రాన్ని ప్రేక్షక దేవుళ్ళు ఆశీర్వదించాలని కోరుకొంటున్నాను అన్నారు.
 
ఈ కార్యక్రమంలో చిత్ర పరిశ్రమకు చెందిన రామ సత్యనారాయణ, లయన్ వెంకట్, అమర్ నాథ్ రెడ్డి, ప్రకాష్ పులిజాల, శ్రీనివాస్ నాయుడు, రాంబాబు నాయక్ , రమేష్ బాబు, సత్యదేవ్, జగన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.అపర్ణ, జెమినీ సురేష్, రాజ్ బాల, స్నేహల్, వింధ్యా రెడ్డి, కుమార్ సాయి, ఆనంత్, లావణ్య, మాధవి ప్రసాద్, కార్తీక్ అయినాల, శ్రీనివాస్ రాజు తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం - హరి గౌర, ఎడిటర్ - ఈశ్వర్ 57, సినిమాటోగ్రఫీ - వివేక్ రఫీ ఎస్కే, సాహిత్యం - బాలాజీ, ఆర్ట్ - రమేష్, కొరియోగ్రఫీ - శ్రీనివాస్, వినయ్, ఫైట్స్ - రియల్ సతీష్, నిర్మాత - ఎ. మోహన్ రెడ్డి, కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం - ఆనంద్ కానుమోలు.