శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (09:04 IST)

నటుడు నాగభూషణం సతీమణి సీత ఇకలేరు

ప్రముఖ నటుడు నాగభూషణం సతీమణి సీత ఇకలేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమె సోమవారం హైదరాబాద్ నగరంలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆమె వయసు 87 యేళ్లు. ఆమె అంత్యక్రియలు కూడా మహాప్రస్థానంలో సోమవారమే పూర్తి చేశారు. 
 
రక్తకన్నీరు నాటకం సమయంలో ప్రముఖ నటుడు నాగభూషణంతో అయిన పరిచయం పెళ్లికి దారితీసింది. 1956లో ఆయనను వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె భువనేశ్వరి, కుమారుడు సురేందర్ ఉన్నారు.
 
కాగా, దిగ్గజ దర్శకుడు కేవీరెడ్డి రూపొందించిన ‘యోగి వేమన’ సినిమాతో ఆమె చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆ సినిమాలో ఆమె బాలనటిగా కనిపించారు. హాస్య నటిగా గుర్తింపు తెచ్చుకున్న సీత.. మాయాబజార్, గుణసుందరి కథ, పెళ్లినాటి ప్రమాణాలు, పెద్దమనుషులు, స్వర్ణసుందరి, స్వప్నసుందరి, పరమానందయ్య శిష్యులు, పల్నాటియుద్ధం, పంతులమ్మ, నలదమయంతి తదితర సినిమాల్లో నటించారు.
 
2002లో చివరిసారి 'నేనేరా పోలీస్' అనే చిత్రంలో కనిపించారు. సుమారు 250 సినిమాల్లో నటించిన సీత.. 2 వేల వరకు నాటక ప్రదర్శనలు ఇచ్చారు. 'రుతురాగాలు' వంటి బహుళ ప్రేక్షకాదరణ పొందిన సీరియల్‌లోనూ నటించారు.