మ్యూజిక్ రంగంలోకి జ్ఞాపిక
Praveena Kadiala, Vijayendra Prasad etc
టెలివిజన్ రంగంలో విశిష్టమైన అనుభవం పొంది గుణ 369 చిత్రంతో చిత్రరంగంలోకి ప్రవేశించి చక్కని విజయం సాధించిన నిర్మాణ సంస్థగా పేరుపొందింది జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్. వావ్, అలీతో జాలీగా, అలీతో సరదాగా, మా మహాలక్ష్మీ, తదితర ప్రోగ్రామ్‌ల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది జ్ఞాపిక. ఈ నిర్మాణసంస్థ సినిమా వారికి అందుబాటులో ఉండాలనే ఉద్ధేశ్యంతో జ్ఞాపిక మ్యూజిక్ అనే టైటిల్‌తో ఆడియో రంగంలోకి అడుగుపెట్టనుంది. సోమవారం జ్ఞాపిక మ్యూజిక్‌ను లాంఛనంగా ప్రారంభించారు ప్రముఖ కథా రచయిత విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా లోగోను, యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం సంగీతానికి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియా ప్రభావంతో అన్ని రకాలైన సాంకేతిక నిపుణులకు తమ సత్తా నిరూపించుకునే చాన్స్‌లు పుష్కలంగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదేమో. ఈ సమయంలో మార్కెట్‌లోకి వస్తున్న జ్ఞాపిక మ్యూజిక్ చక్కని విజయాలు సాధించి సినిమా వారికి అందుబాటులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు.
జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత ప్రవీణ కడియాల మాట్లాడుతూ, కరోనా సమయంలోకూడా మా జ్ఞాపిక మ్యూజిక్ ఆయన చేతుల మీదుగా ప్రారంభించాలి అని అడగగానే అనందంగా మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన విజయేంద్రప్రసాద్ గారికి కృతజ్ఞతలు.ఈ రోజు ప్రారంభమైన మా జ్ఞాపిక మ్యూజిక్‌లో సినిమా ఆడియోలతో పాటు, ప్రవేట్ సాంగ్స్, భక్తిగీతాలు, వీడియో సాంగ్స్‌ని మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాం. అలాగే నూతన టాలెంట్‌ని ఎంకరేజ్ చేయటం కోసమే, అంటే కొత్త గాయనీ గాయకులు, రచయితలు, వాయిద్య కళాకారులు ఇలా ఎంతోమంది కళాకారులను పరిచయం చేసే ఉద్ధేశ్యంతో మేము మ్యూజిక్ రంగంలోకి అడుగు పెడుతున్నాం అన్నారు.