సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By
Last Modified: శుక్రవారం, 12 జులై 2019 (22:10 IST)

80ల్లో 'దొరసాని' 2020 తరం ముందుకు వస్తే ఎలా వుంటుంది? సినిమా రివ్యూ

'దొరసాని' అయినంత మాత్రాన ఆమెకు మిగతా ఆడవారిని మించిన ప్రత్యేకతలు ఏమీ ఉండవని మరోసారి తెలియజెప్పే సినిమా దొరసాని. ఆ మాటకొస్తే గడీలో ఉండే దొరసానులకు సాధారణ స్త్రీలకు లభించే స్వేచ్ఛ కూడా లభించదనేది కఠినమైన నిజం.

సుదీర్ఘకాల ముస్లిం పాలన ఫలితంగా వారి పరదా సంస్కృతి తెలంగాణలోని గడీలలోకి వ్యాపించిందనుకోవచ్చు. దానివల్ల దొరసానుల బతుకు మరింతగా చీకటి గదులకు పరిమితమైంది. అలాంటి నేపథ్యంతో 80లలో తెలంగాణ ప్రాంతంలో దొరల కాలంలో జరిగిన ఒక నిజజీవిత ప్రేమకథ ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం ఇది.
 
సినిమా చూస్తున్నంత సేపు దాశరథి రంగాచార్యుల వారి 'చిల్లర దేవుళ్లు'మదిలో మెదలాడుతుంది. కథలో కొత్తదనం అంతగా లేకపోయినా, చరిత్రలో చదివిన, విన్న పాత్రలు ప్రాణం పోసుకుని మన ముందు నిలబడిన అనుభూతి కలుగుతుంది. దొర కూతురు చిన్నదొరసాని దేవకి, సున్నాలేసుకునే కూలీ కొడుకు రాజు తొలిచూపులోనే ఒకరినొకరు ఇష్టపడతారు. 
 
యువతీయువకుల మధ్య ఇష్టమంటూ మొదలయ్యాక అది ప్రేమగా మారకపోతే అసహజం కనుక వీరి ఇష్టం కూడా ప్రేమ అనే పాయింట్ దగ్గర ఆగుతుంది. వారిరువురి ప్రేమ వ్యవహారం గురించి తెలుసుకున్న దొరసాని తండ్రి రాజును నానా కష్టాలకు గురిచేస్తాడు. ఆ కష్టాలన్నింటినీ రాజు ఎలా ఎదుర్కొన్నాడు? రాజు, దేవకీల ప్రేమ సఫలమా? విఫలమా? అనేదే దొరసాని సినిమా కథ.
 
మామూలుగా సినిమా ప్రేమకథలు ఎలా ఉంటాయో... దొరసాని కథ కూడా అలాగే ఉంది. ప్రేమిస్తే, సైరాట్... ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో సినిమాలు ఇదే ఫార్ములతో మన ఊహకు తడతాయి. సినిమా చూస్తున్నంత సేపు కథ పాతది కాబట్టి కథనాన్ని కూడా పాతపద్దతిలోనే నడిపించాలనుకున్నాడా దర్శకుడు అనే అనుమానం కలుగుతుంది.
 
కథ 80వ దశకంలోదే అయినా... దాన్ని చూసే ప్రేక్షకుడు 2020 దరిదాపుల్లో ఉన్నాడన్న విషయం దృష్టిలో ఉంచుకుని ఉంటే, నరేషన్ ఇంకాస్తా వేగమందుకునేదేమో. నటుడు రాజశేఖర్, జీవితల కూమార్తె శివాత్మిక దొరసాని టైటిల్ రోల్ పోషించింది. దేవకి పాత్రకు ఆమె సరిగ్గా సరిపోయింది. నటనలో చాలా ఈజ్ కనిపించింది. బహుశా చిన్నతనం నుండి సినీ నేపథ్యంలో పెరగడం కారణం కావచ్చు.
 
ఇక రాజు పాత్రలో నటుడు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఫరవాలేదనిపించాడు. డైలాగ్ డెలివరీలో అన్నను ఇమిటేట్ చేయాలన్న తాపత్రయం తగ్గిస్తే, మరింత మంచి ఔట్‌పుట్ వచ్చుండేదేమో. దొరగా విలన్ పాత్ర పోషించిన వినయ్ వర్మ ఒకనాటి తెలంగాణ గడీల దౌర్జన్యాన్ని బాగా ప్రదర్శించారు. కమ్యూనిస్టు సంఘ నాయకుడిగా కిశోర్, గడీలో దాసిగా శరణ్య... ఎవరి పాత్రల్లో వారు ఒదిగిపోయారు.
 
తెలంగాణ భాష, యాస, వాతావరణాలతో ప్రేక్షకుడిని సునాయాసంగా ప్రేక్షకులకు సినిమాకు కనెక్ట్ చేయగలిగారు. తెలంగాణ ప్రాంతంలో దొరల దుర్మార్గాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీలు, సంఘం వాళ్ళు, పీపుల్స్‌వార్ నక్సలైట్లు... ఏం చేసేవారో కథానుగుణంగా స్పృశిస్తూ కథ ముందుకు నడుస్తుంది.
 
ఇక దొరల చేతుల్లో దాసిలా బతుకు ఎలా ఉంటుందో తెలియజెప్పే పాత్ర శరణ్యది. కూతురి కంటే వయసులో ఏ కొంతో పెద్దదైన పాలేరు భార్య అయిన దాసిని దొర లైంగికంగా వాడుకోవడం. దానికి దాసి తన అయిష్టతను తెలపలేకపోవడం. దొరకు మద్దతు పలుకుతూ తమను తామే తక్కువ చేసుకునే ఊరిజనం. దొర అండ చూసుకుని అంచెలవారీగా ఒకరిని మించి మరొకరు ప్రజల మీద అధికార దర్ఫం చూపడం.
 
క్లైమాక్స్‌లో ప్రేమికులను చంపేసి, తగలబెట్టబోయే ముందు కూడా దొర కొడుకు తన చెల్లి, ఒక కులం తక్కువ వ్యక్తిని తాకేంత దగ్గరగా ఉండడాన్ని సహించలేక ఇద్దరినీ విడదీసి మరీ తగులబెట్టడం కుల వైషమ్యాలకు పరాకాష్ట. తెలంగాణలో జరిగిన ఒక విఫల ప్రేమ కథను ఆధారంగా చేసుకుని, ఆనాటి తెలంగాణ జీవితాలను చూపించాలని దర్శకుడు కెవిఆర్ మహేంద్ర చేసిన ప్రయత్నమిది. అయితే, నేపథ్యంతో పాటు కథ, కథనాలలో మరింత శ్రద్ద పెట్టి ఉంటే బాగుండేది.
 
సినిమాకు ఆయువుపట్టు ప్రశాంత్ విహారి సంగీతం. మెలోడీగా సాగే పాటలు, బీజీఎం ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయి. ఆర్ట్ వర్క్ మెచ్చుకోదగినది.
 
-కె. సరిత
బీబీసీ కోసం