శనివారం, 30 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 7 జనవరి 2022 (23:15 IST)

స‌స్పెన్స్‌ను క్రియేట్ చేసిన హాఫ్‌ స్టోరీస్ చిత్రం

Half Stories poster
నటీ,నటులు: రాజీవ్ సాలూరి, రంగస్థలం మహేష్, రాకేందు మౌళి, సంపూర్ణేష్‌ బాబు, కోటి, కంచరపాలెం రాజు, టి.ఎన్ఆర్‌ తదితరులు.
సాంకేతిక‌తః 
సినిమాటోగ్రఫీ : చైతన్య కందుల, సంగీతం : కోటి, ఎడిటర్‌: సెల్వ కుమార్‌, నిర్మాణ సంస్థ: వెన్నెల క్రియేషన్స్,  నిర్మాత: యం. సుధాకర్ రెడ్డి  దర్శకత్వం :  శివ వరప్రసాద్ కె.
 
విడుదల తేది : జనవరి 7,2022
 
ఇప్ప‌టి యువ ద‌ర్శ‌కులు ఏదో కొత్త పాయింట్‌తో ముందుకు వ‌స్తున్నారు. అందులో ఓటీటీ మాద్య‌మం బాగా అనుకూలంగా వుండ‌డంతో ఆ ఫార్మెట్‌లో క‌థ‌లు రాసుకోవ‌డం జరుగుతుంది. మ‌రోవైపు థియేట‌ర్ల‌లో కూడా సినిమాలు విడుద‌ల‌చేసేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు చిన్న సినిమాలు అనుకూలంగా మారాయి. ఆ క్ర‌మంలో వినూత్న‌మైన కాన్సెప్ట్‌తో వ‌చ్చిన సినిమా ‘హాఫ్‌ స్టోరీస్‌’. టైటిల్ విన‌గానే స‌గ‌మే సినిమా చూపిస్తారు. దానికి సీక్వెల్ కూడా వుంటుంద‌నే ద‌ర్శ‌కుడు ముందుగానే ప్రేక్షకుల్ని సిద్ధం చేశాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి మంచి స్పందన రావడంతో పాటు సినిమాపై ఆసక్తిని పెంచింది. ఓ మోస్తరు అంచనాలతో జనవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘హాఫ్‌ స్టోరీస్‌’ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 
 
క‌థః
గౌత‌మ్ (రాజీవ్ సాలూరి) ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమెను పొందాల‌నే ఎయిమ్ జెమినీ సురేష్‌ది. అత‌నికి భ‌య‌ప‌డి ఇంటినుంచి వెళ్లిపోయి గౌత‌మ్ ఇంటికి వ‌స్తుంది ఆమె. స‌ర‌దాగా గౌత‌మ్‌తో గ‌డిపిన కొద్ది సేప‌టికి ఆమె మాయ‌మ‌వుతుంది. ఇంకోవైపు అసిస్టెంట్‌ డెరెక్టర్‌గా పనిచేసే శివ (రాకెందు మౌళి), లక్ష్మీ(శ్రీజ), చిన్నా(జబర్దస్థ మహేశ్‌) స్నేహితులు. ఓరోజు బ్యాంక్‌ క్యాష్‌ వ్యాన్‌ ప్రమాదానికి గురికావడంతో ఆ డబ్బును కొట్టేయడానికి ఈ ముగ్గురు ఒకరిపై ఒకరు మోసానికి పాల్పడుతుంటారు. చివరికి ఆ డబ్బులు ఎవరికి సొంతం చేసుకున్నారు? ఆ డబ్బును చేజిక్కుంచుకునే క్రమంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అస‌లు మ‌నుషులుగా క‌నిపించే వారు నిజ‌మైన మ‌నుషులేనా ఆత్మ‌లా? మ‌రి ఈ క‌థ‌లో సంపూర్ణేష్‌ బాబు పాత్ర ఏమిటి?  అనేదే మిగతా కథ. 
 
విశ్లేష‌ణః
క‌థ‌లు క‌థ‌లుగా చెప్ప‌డ‌మే ఈ చిత్రం ఉద్దేశ్యం. కొన్ని కథల, పాత్రల సంకలనమే ‘హాఫ్‌ స్టోరీస్‌’కథ. అందుకే ముగింపుకూడా స‌గ‌మే చూశామ‌నే ఫీలింగ్ క‌లుగుతూ ఆ త‌ర్వాత ఏం జ‌రుగుతుంది? అనే ఉత్కంఠ‌ను ద‌ర్శ‌కుడు క్రియేట్ చేశాడు. ఆత్మ‌లు నేప‌థ్యంలో ప‌లు చిత్రాలు వ‌చ్చాయి. అయితే క‌థ‌లు క‌థ‌లుగా చెప్ప‌డంతో ఓ కొత్త ప్ర‌యోగానికి ద‌ర్శ‌కుడు శ్రీ‌కారం చుట్టారు. 
చాలా కొత్తగా, డిఫరెంట్‌గా తెరకెక్కించాడు దర్శకుడు శివ వరప్రసాద్. వరుస ట్విస్ట్‌లో సినిమా మొత్తాన్ని ఆసక్తికరంగా నడిపించాడు. తన స్నేహితులకు స్టోరీ చెప్పడం.. ఆ స్టోరీలో ఇంకో స్టోరీ రావడం..ఇదంతా ఓ బాలుడు సినిమాగా చూడడం.. ఇలా వరుస ట్విస్ట్‌లతో ‘హాఫ్‌ స్టోరీస్‌’సినిమా సాగుతుంది.  సినిమాలో మనుషులు ఎవరో, దెయ్యాలు ఎవరో తెలియకుండా.. క్షణ క్షణానికి ఓ ట్విస్ట్‌ ఇచ్చి ప్రేక్షకుడి సీటుకే కడ్డిపడేశాడు.
పాత్ర‌ల‌ప‌రంగా చూస్తే, 
ఈ సినిమాలో పాత్రలు ఇలా వచ్చి అలా వెళ్తుంటాయి. యువ దర్శకుడు శివగా రాకెందు మౌళి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. గౌతమ్‌గా రాజీవ్‌,  చిన్నగా మహేశ్‌, సినిమా రచయిత సంపూగా సంపూర్ణేశ్‌ బాబు,  రాఘవ్‌గా జెమిని సురేశ్‌, ఎస్సై శశికాంత్‌గా టీఎన్‌ఆర్‌, లక్ష్మీగా శ్రీజ, ఆధ్యాగా అంకిత  వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. 
 
ప్ర‌తి స‌న్నివేశం స‌స్పెన్స్‌ను క్రియేట్ చేయ‌డంతో ఎవ‌రు నిజ‌మో, ఎవ‌రు అబద్ధ‌మో అన్న సందిగ్థ‌త ప్రేక్ష‌కుడిలో క‌లుగుతుంది. మెచ్యూర్డ్‌గా ద‌ర్శ‌కుడు తీయ‌డంతో సగటు ప్రేక్షకుడికి సినిమాలోని ట్విస్టులన్నీ గందరగోళంగా అనిపిస్తాయి. అసలు స్టోరీ ఏంటనేది తెలియక అయోమయానికి గురవుతాడు. అయినప్పటికీ.. సినిమా మాత్రం ఎక్కడా బోర్‌ కొట్టించకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. 
 
అక్క‌డ‌క్క‌డా కొన్ని లోపాలున్నా వాటిని మ‌ర్చిపోయేలా ట్విస్ట్‌లు చూప‌డంతో వాటిని మ‌ర్చిపోయేలా చేశాడు ద‌ర్శ‌కుడు. టైటిల్‌ మాదిరే ఒక్కో స్టోరీని పూర్తిగా చూపించకుండా హాఫ్‌, హాఫ్‌గా చూపించి.. సగం సినిమా మాత్రమే చూశామనే ఫీలింగ్‌తో ప్రేక్షకుడు బయటకు వచ్చేలా చేశారు. క్లైమాక్స్‌లో అయినా ఈ ట్విస్ట్‌లన్నింటికీ పుల్‌స్టాఫ్‌ పెడిగే బాగుండేది. పార్ట్‌-2 ఉంది కాబట్టి ఆ చిక్కుముడులన్నీ అలానే వదిలేశాడేమో దర్శకుడు.
 
వ‌న్‌డే మ్యాచ్‌లా కాకుండా టెస్ట్ మ్యాచ్‌లా ఈ క‌థ‌ను ఎన్నిభాగాలైనా తీయ‌వ‌చ్చు. ఈ థ్రిల‌ర్‌, స‌స్పెన్స్ సినిమాకు నేప‌థ్య సంగీతం చాలా కీల‌కం. దానికి సంగీత ద‌ర్శ‌కుడు కోటి పూర్తి న్యాయం చేశాడు. కొన్నిసార్లు బీజిఎం.తో భ‌య‌పెట్టేలా చేశాడు. చైతన్య కందుల సినిమాటోగ్రఫీ క్లారిటీగా వుంది. ఇలాంటి క‌థ‌కు ఎడిట‌ర్‌కు పెద్ద ప‌నే. దాన్ని సెల్వ కుమార్ బాగానే డీల్ చేశాడు. ప‌రిమిత బ‌డ్జెట్‌తో తీసిన ఈ సినిమా నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. ర‌విచావ‌లి ద‌గ్గ‌ర ప‌నిచేసిన శివ వరప్రసాద్ కె. తొలి ప్ర‌య‌త్నంగా ఆత్మ‌ల అంశాన్ని ఎంచుకున్నాడు. ఇలాంటివి ఎటువంటివారికైకా ఆస‌క్తి క‌లిగిస్తాయి. మ‌రి రెండో భాగం వ‌స్తేకానీ ఫుల్ స్టోరీ చూసిన‌ట్లు వుండ‌దు. 
రేటింగ్ః 3/5