నటీనటులు: నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ తదితరులు
సాంకేతికతః సినిమాటోగ్రఫీ: సాను జాన్ వర్గీస్, దర్శకత్వం : రాహుల్ సంకృత్యాన్, నిర్మాత: వెంకట్ బోయనపల్లి, సంగీత దర్శకుడు: మిక్కీ జే మేయర్, ఎడిటర్ : నవీన్ నూలి
విడుదల తేదీ : డిసెంబర్ 24, 2021
నాని నటించిన టక్ జగదీష్ ఓటీటీలో విడుదలైంది. థియేటర్‌కు అప్పటి పరిస్థితులు అనుకూలించలేదు. అందుకే ఈసారి శ్యామ్ సింగరాయ్ పేరుతో థియేటర్‌కు వచ్చాడు. కానీ ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్ల తనిఖీ పేరుతో కొన్ని మూసివేయబడ్డాయి. ఇలాంటి ఖటిమైన స్థితిలో తన సినిమా విడుదల అయింది. మొదటినుంచి క్రిస్‌మస్ మాదే అంటూ గట్టిగా చెబుతున్న నాని చెప్పిన దానిలో ఎంత నిజముందో తెలియాలంటే సమీక్షలోకి వెళ్ళాల్సిందే.
కథ :
వాసుదేవ్ (నాని) ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసి దాని ద్వారా సినిమా అవకాశం సంపాదించాలనే ఎయిమ్‌లో వుంటాడు. ఈ క్రమంలో ఓ కాపీషాప్‌లో కీర్తి (కృతి శెట్టి)ని చూసి తన షార్ట్ ఫిలింకు ఈమెనే హీరోయిన్ అని ఫిక్సయిపోతాడు. ఆమెకు ఇష్టంలేదన్నా వీక్‌నెస్ కనిపెట్టి ఒప్పిస్తాడు. తీశాక అది ఓ నిర్మాతకు నచ్చి సినిమా అవకాశం ఇస్తాడు. ఉనికి టైటిల్‌తో సినిమా తీస్తాడు. ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని ప్రముఖ సంస్థ ముందుకు వస్తుంది. ముంబైలో ప్రెస్‌మీట్ పెడుతుంది. ఇది తెలుసుకున్న కొల్‌కత్తాకు చెందిన ఓ పబ్లిషింగ్ సంస్థ ఉనికి కథ తమదేనని కాపీ నేరం కింద వాసుపై కేసు పెడుతుంది. వాసు అరెస్టయి బెయిల్‌పై వస్తాడు. కానీ కేసు నడుస్తూనే వుంటుంది. కోర్టు పరిశీనలోనూ అతను నిజమే చెబుతున్నానని తెలిసినా వాస్తవాలు కావాలి కాబట్టి అతని ఓ సైక్రియాటిస్ట్‌కు లాయర్ తీసుకెళుతుంది. అప్పుడు ఏం జరిగింది? అసలు ఈ వాసు ఎవరు? ఎక్కడో కొల్ కొత్తాలో వున్న శ్యామ్ సింగరాయ్ కథను వాసు కాపీ చేయడం ఏమిటి? దీని వెనుక అసలు కథ ఏముంది? అనేది తెరపై చూడాల్సిందే.
విశ్లేషణః
సినిమా ఆరంభంనుంచి నాని సహజమైన నటనతో షార్ట్ ఫిలిం సన్నివేశాలతో సరదాగా సాగుతుంది. దర్శకుడు అవ్వాలనే గోల్ కోసం అతను పడే తపన ఇందులో కనిపిస్తుంది. తన బాడీ లాంగ్వేజ్ తో కొన్ని యాక్షన్ ప్లాష్ బ్యాక్ సీక్వెన్స్ స్ లో తన డైలాగ్ డెలివరీతో నాని చాలా బాగా నటించాడు. తన నటనతోనే కాకుండా తన లుక్స్ తో కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాడు.
కథాపరంగా చెప్పాలంటే బలీయమైన కోరికతో సమాజాన్ని మార్చాలనుకునే శ్యామ్ సింగరాయ్ కథ ఇది. దీనికి వాసుకు ఎటువంటి సంబంధం వుందని తెలియాలంటే కర్మ సిద్ధాంతం తెలుసుకోవాల్సిందే. ఇప్పటి జనరేషన్‌కు పెద్దగా తెలియకపోయినా వేదాల్లో చెబుతున్నట్లు ప్రతి మనిషికి గత జన్మ వుంటుందనే కోణంలో దీన్ని రచయిత రాసిన దానికి దర్శకుడు హీరో న్యాయం చేశారు. సందర్భానుపరంగా వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. కథలో భాగంగా 1967లో బెంగాల్ లో దేవదాసీ వ్యవస్థ, నిమ్నజాతి వ్యవస్థ ఏవిధంగా వుందో కళ్ళకు కట్టినట్లు చూపించాడు.
నటనా పరంగా అందరూ బాగా సరిపోయారు. దేవీదాసీగా సాయి పల్లవి నాట్యంతోనూ నటనతోనూ ఆకట్టుకుంది. వాసుకు తోడుగా నటించిన కృతి శెట్టి కూడా తన నటనతో ఆకట్టుకుంది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.
దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తీసుకున్న స్టోరీ లైన్, రాసుకున్న కొన్ని యాక్షన్ సీక్వెన్స్ స్ బాగున్నాయి. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో వచ్చే ప్లాష్ బ్యాక్ మరియు శ్యామ్ సింగరాయ్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే సీన్స్ బాగున్నాయి. ఇక చివర్లో ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సినిమాను ముగించడం కూడా ఆకట్టుకుంది.
అయితే శ్యామ్ సింగరాయ్ పాత్రను, ఆ పాత్ర తాలూకు ప్లాష్ బ్యాక్ ను బాగా డైజైన్ చేసుకున్న దర్శకుడు అంతే స్థాయిలో ట్రీట్మెంట్ ను రాసుకోలేదు. అలాగే 1975 కాలంలో జాతీయ స్థాయిలో గొప్పగా ప్రభావితం చేసిన ఓ గొప్ప రచయిత ఫోటోను ఏ పత్రిక ప్రచురించలేదు కాబట్టి.. అతను ఎలా ఉంటాడో ఇప్పటి తరానికి ఎవరికి తెలియదు అని మాటలతో సరిపెట్టడం లాజికల్ కరెక్ట్ గా అనిపించదు. ఎందుకంటే పబ్లిషిక్ సంస్థ పూర్వీకుని ఇంటిలోనే శ్యామ్ ఫొటో వుంటుంది. కేసు వేసిన వారి వారసులు చూడలేదా! అనే అనుమానం కూడా ప్రేక్షకుడికి కలుగుతుంది.
పైగా అన్నదమ్ములే సమాజం కోసం శ్యామ్ సింగరాయ్ ను ఏవిధంగా చూశారనేది ఇంకాస్త డెప్త్‌గా చూపిస్తే బాగా పండేది. సినిమాలో కీలకం అదే. దాన్ని మరింతగా మెరుగులు దిద్దితే బాగుండేది. ఇక ముగింపు కూడా హృదయాన్ని టచ్ చేసేదిగా వుంది. అంతా చూశాక.. క్రిస్‌మస్ మనదే అన్న నాని చెప్పిన మాటలు నిజమే అనిపిస్తాయి.
ఇక సాంకేతికపరంగా చూస్తే, మిక్కీ జే మేయర్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యింది. చాలా సన్నివేశాలతోపాటు దేవాలయంలో తానే దేవుడుననే స్వామీజి దేవదాసీలను నీచంగా చూసే విధానం, ఆ తర్వాతం వాసు అతన్ని చంపే యాక్షన్ ఎపిసోడ్‌లో నేపథ్య సంగీతం అప్పటికాలానికి చెందినట్లుగా బాగా ఆవిష్కరించాడు. దర్శకుడు రాహుల్ డైరెక్షన్ పరంగా బాగా ఆకట్టుకున్నాడు. ఇక నిర్మాతగా వెంకట్ బోయినపల్లి పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.
శ్యామ్ సింగరాయ్ లో అన్ని ఎమోషన్స్ వున్నాయి. 1960 నుంచి ఇప్పటి కాలానికి చెందిన కథగా రెండు పాత్రలతో పునర్జన్మ నేపథ్యంలో అర్థమయ్యేలా చెప్పగలిగాడు దర్శకుడు. సినిమా కళాత్మకంగా ఎమోషనల్ గా సాగుతూ ఆకట్టుకుంది. అప్పటిలో అభ్యుదయ సాహిత్యం, మాటలు శ్యామ్ లో కనిపిస్తాయి. ఒకవైపు నగ్జలిజాన్ని కూడా టచ్ చేశాడు. మరోవైపు శ్రీశ్రీ కూడా శ్యామ్ రాతలకు అభిమానిగా ఓ లెటర్ ద్వారా చూపించాడు. ఇక వీటితోపాటు నాని – సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగా ఆకట్టుకుంది.కుటుంబంతో కలిసి హ్యాపీగా చూసే సినిమా.
రేటింగ్ : 3.25/5