ఉప్పాడ తీరంలో సముద్రం ఉగ్రరూపం : పిఠాపురం మాజీ ఎమ్మెల్యే జస్ట్ మిస్
కాకినాడు జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలో సముద్రం ఉగ్రరూపం దాల్చింది. దీంతో కాకినాడ - ఉప్పాడ బీచ్ రోడ్డు బాగా దెబ్బతింది. దీన్ని పరిశీలించేందుకు వెళ్లిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. తీరం రహదారిపై నడుచుకుంటూ వస్తుండగా, ఒక్కసారిగా రాక్షస అల ఒకటి ఉవ్వెత్తున ఎగిసిపడి, అలలు చుట్టుముట్టాయి. దీంతో అక్కడున్నవారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉప్పాడ తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. దీని ప్రభావంతో ఉప్పాడ - కాకినాడ బీచ్ రోడ్డు తీవ్రంగా దెబ్బతింది. భారీ కెరటాల తాకిడికి రోడ్డు కోతకు గురై పూర్తిగా ధ్వంసమైంది. ఈ పరిస్థితిని పరిశీలించడానికి వర్మ అక్కడికి వెళ్ళారు. ఆయన పరిస్థితిని అంచనా వేస్తుండగా ఓ భారీ కెరటం ఒక్కసారిగా దూసుకొచ్చి ఆయన్ను చుట్టుముట్టింది. దీంతో అప్రమత్తమైన ఆయన వెంటనే వెనక్కి జరిగి సురక్షితంగా బయటపడ్డారు.
అనంతరం ఆయన కొత్తపట్నం గ్రామానికి వెళ్ళి సముద్రపు నీటితో నష్టపోయిన జాలర్లతో మాట్లాడి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి వర్మ మాట్లాడుతూ, ప్రభుత్వం మీకు అన్ని విధాలా అండగా ఉంటుంది. ఈ సమస్యలకు త్వరలోనే పరిష్కారం కల్పిస్తాం అంటూ భరోసా ఇచ్చారు. మరోవైపు, అధికారులు ముందు జాగ్రత్త చర్యగా బీచ్ రోడ్డుపై రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. అలల ఉధృతి తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జాలర్లు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీచేశారు.