గురువారం, 2 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : బుధవారం, 1 అక్టోబరు 2025 (17:42 IST)

Ravi Teja: మాస్ జాతర కోసం సబ్ ఇన్ స్పెక్టర్ లక్మణ్ భేరి ఏం చేశాడు...

Mass Maharaja Ravi Teja as Sub Inspector Laxman Bheri
Mass Maharaja Ravi Teja as Sub Inspector Laxman Bheri
మాస్ మహారాజా రవితేజ మాస్ జతర చిత్రం అక్టోబర్ 31న విడుదల కానుంది. ఈ మేరకు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈరోజు విడుదలచేసిన పోస్టర్ లో సబ్ ఇన్ స్పెక్టర్ లక్మణ్ భేరి పాత్రలో నటిస్తున్నారు. కుర్చీలు కూర్చుని రిలాక్స్ గా ఆలోచిస్తున్న పోస్టర్ లో ఎన్నో విషయాలు వుంటాయనిపిస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదలైన ప్రతి కంటెంట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని, వినోదాల విందుకి హామీ ఇచ్చింది.
 
కొత్త విడుదల తేదీ ప్రకటన సందర్భంగా రవితేజ, హైపర్ ఆదిలపై చిత్రీకరించిన ఒక సరదా వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఆ వీడియోలో హైపర్ ఆది 2025 సంక్రాంతి, వేసవి సెలవులు, వినాయక చవితి అంటూ పలుసార్లు సినిమా వాయిదా పడటాన్ని సరదాగా ఎగతాళి చేయగా.. ఆలస్యానికి గల కారణాలపై రవితేజ అంతే చమత్కారంగా స్పందించారు. మాస్ మహారాజా రవితేజ అంటేనే సందడి. ఒకప్పటి మాస్ మహారాజాను గుర్తుచేస్తూ.. సినిమా యొక్క ఆహ్లాదకరమైన మరియు వినోదాత్మక శైలిని చూపిస్తూ ఈ వీడియో ఎంతో ఉత్సాహభరితంగా సాగింది. 
 
ఇప్పటికే విడుదలైన 'మాస్ జతర' టీజర్ కి అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ముఖ్యంగా మాస్ రాజా అభిమానులను, మాస్ ప్రేక్షకులను కట్టిపడేసింది. అలాగే, రెండు పాటలు విడుదలై శ్రోతల నుంచి భారీ ప్రశంసలు అందుకున్నాయి. అందరూ కాలు కదిపేలా ఎంతో ఉత్సాహభరితంగా స్వరపరిచిన ఈ పాటలు సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారాయి. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు. రవితేజ-శ్రీలీల జోడి అంటే, ప్రేక్షకులలో ప్రత్యేకమైన అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ జోడి మరోసారి బాక్సాఫీస్ వద్ద మెరుపులు మెరిపించడానికి సిద్ధమవుతోంది.
 
సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలతో అందరినీ మెప్పించిన ఆయన, మరోసారి మాస్ ప్రేక్షకులను తనదైన స్వరాలతో అలరించబోతున్నారు.
 
దర్శకుడు భాను భోగవరపు మాస్ ప్రేక్షకులతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా మెచ్చే విధంగా వాణిజ్య అంశాలతో అసలైన పండుగ సినిమాలా 'మాస్ జాతర'ను మలుస్తున్నారు. ఉత్సాహభరితమైన అవతారంలో రవితేజను చూడటానికి అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపిస్తారు. అందుకు తగ్గట్టుగానే అందరూ మెచ్చేలా మాస్ రాజాను చూపిస్తున్నారు దర్శకుడు భాను భోగవరపు. ఛాయాగ్రాహకుడు విధు అయ్యన్న అద్భుతమైన కెమెరా పనితనం, ప్రతి ఫ్రేమ్‌ను గొప్పగా తీర్చిదిద్దే నవీన్ నూలి ఎడిటింగ్ ప్రతిభ తోడై.. అసలైన పండుగ చిత్రంగా 'మాస్ జతర' రూపుదిద్దుకుంటోంది. 
 
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య భారీస్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించారు.