పెళ్లయిన ప్రేయసి ఇంట్లో ప్రియుడు తిష్టవేస్తే... 'నిన్నుకోరి' రివ్యూ రిపోర్ట్(వీడియో)
'నిన్నుకోరి' నటీనటులు: నాని, నివేద థామస్, ఆది పినిశెట్టి, మురళీ శర్మ, తనికెళ్ళభరణి తదితరులు, కెమెరా: కార్తిక్ ఘట్టమనేని, సంగీతం: గోపీ సుందర్, నిర్మాత: డివివి దానయ్య, దర్శకత్వం: శివ నిర్వాణ. తెలుగు
'నిన్నుకోరి' నటీనటులు: నాని, నివేద థామస్, ఆది పినిశెట్టి, మురళీ శర్మ, తనికెళ్ళభరణి తదితరులు, కెమెరా: కార్తిక్ ఘట్టమనేని, సంగీతం: గోపీ సుందర్, నిర్మాత: డివివి దానయ్య, దర్శకత్వం: శివ నిర్వాణ.
తెలుగు కథ ఎల్లలు దాటింది. తెలుగు సినిమా వ్యాపారం ఓవర్‌సీస్ (విదేశాలకు) విస్తరించింది. ఇక్కడి కథలు కొన్ని వారికి రుచించడంలేదు. అందుకే మా గురించి కూడా సినిమాలు తీయండని హీరోలను అడుగుతున్నారు. అందులో భాగంగానే నాన్నకు ప్రేమతో.. ఎన్‌టిఆర్ అడిగితే తీశారు. ఆ తర్వాత నాని కూడా అక్కడివారు అడిగితే.. తప్పకుండా చేస్తానని హామీ ఇచ్చాడు. అందుకే అక్కడి కథలకు అనుగుణంగా హీరోలు, నిర్మాతలు సినిమాలు తీస్తున్నారు. నాని నటించిన 'నిన్నుకోరి' సినిమా కూడా అటువంటి కథే. మరి ఆ కథ ఏమిటో చూద్దాం.
కథ :
పల్లవి (నివేదా థామస్) కాలేజీ విద్యార్థిని. రాకపోయినా బలవంతంగానైనా డాన్స్ నేర్చుకుని పెండ్లయ్యాక అనుభూతులుగా పిల్లలకు చూపించాలనే మైండ్‌సెట్‌తో వుంటుంది. కాస్త అమాయకురాలు. తండ్రి మురళీశర్మ కూతురిని మంచి యోగ్యుడికి ఇవ్వాలనుకుంటాడు. నాని కాల్యుకేషన్‌లో పిహెచ్‌డి చేస్తుంటాడు. అనుకోకుండా పల్లవితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీస్తుంది. కెరీర్ కోసం ఢిల్లీ వెళ్ళానుకున్న సమయంలో లేచిపోదామని నానిని ఒత్తిడి చేస్తుంది పల్లవి. ఆమె తండ్రి తత్త్వం తెలిసి తాను తిరిగి వచ్చాక పెండ్లిచేసుకుంటానంటాడు.
ఆ తర్వాత పరిణామాల వల్ల పల్లవి ఆది పినిశెట్టితో పెండ్లి జరగడం లండన్ వెల్లడం జరిగిపోతుంది. ఏడాది తర్వాత తిరిగి వచ్చిన నానికి విషయం తెలిసి.. దేవదాసులా మారతాడు. విషయం గ్రహించిన నాని గురువు భరణి.. నానికి లండన్‌లో ఓ ఉద్యోగం వచ్చేలా చేస్తాడు. ఈ విషయాన్ని పల్లవికి చెబుతాడు. ఆ తర్వాత ఆమె నానిని కలుస్తుంది. ఆమె మొహం చూసి సుఖంగా లేదనీ.. తనతో వచ్చేయమని నాని బలవంతం చేస్తాడు. నేను సుఖంగా వున్నాననీ.. కావాలంటే 10 రోజులు మా ఇంట్లో వుండి పరిశీలించమని ఆఫర్ ఇస్తుంది. ఇందుకు పల్లవి భర్త ఆది కూడా అంగీకరిస్తాడు. ఆ తర్వాత ఏమి జరిగిందనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
ఓ ప్రేమికుడు.. పెళ్ళయిన తన ప్రేయసి సుఖంగా వుందా! లేదా! అనేది తెలియాలంటే పదిరోజులు ఆమె ఇంట్లో వుంటే సరిపోతుందనే కాన్సెప్ట్‌ను దర్శకుడు శివ ఎంచుకున్నాడు. ఆమధ్య బొమ్మరిల్లులో హీరోయిన్ హీరో ఇంట్లో వారంరోజులు వుండి పరిశీలించిమన్నట్లన్నమాట. కథ ఎక్కువగా విదేశాల్లో జరుగుతుంది. మొదటి భాగంలో కొంత వైజాగ్‌లో హీరోహారోయిన్ల లవ్ ట్రాక్ నడిపి ఆ తర్వాత విదేశాల్లోకి వెళుతుంది. పిల్ల తండ్రిగా మురళీశర్మ పడే తపన ప్రతి తెలుగువాడు పడేదే. అయితే తన కూతుర్ని విదేశాలకు పంపాక అక్కడ విచిత్రంగా అనిపిస్తుంది. అక్కడ కల్చర్ అంతా రివర్స్.
ప్రేమించి పెండ్లి చేసుకోవడం. పిల్లలు పుట్టాక ఏదో చిన్న పేచీతో విడిపోవడం.. మరో పెండ్లి చేసుకోవడం.. మొదట పుట్టిన పిల్లలు.. ఆ తర్వాత పెండ్లి చేసుకున్న పిల్లలతో కలిసి వుండటం.. ఓ సందర్భంలో వారూవీరూ కలిస్తే.. ఎవరు ఎవరి తండ్రో అర్థంకాకుండా చూసేవాడికి అంతా గందరగోళంగా వుంటుంది. ఇదంతా మలయాళ సినిమా చూస్తున్నట్లుందని మురళీశర్మ అంటాడు. తన కూతురు స్నేహితురాలు ఇలా రెండు పెండ్లిండ్లు చేసుకున్న సందర్భంలో ఆయన డైలాగ్ అది.
ఇలా తెలుగు సంస్కృతి సంప్రదాయాలను మరిచి పాశ్చాత్య కల్చర్ ఎలా కొనసాగుతుందో చూపించాడు. ఇదంతా అక్కడి వారికి బాగానే వుంటుంది. కానీ మన తెలుగువారికి ఇదంతా చికాకు అనిపిస్తుంది. బలవంతంగా తెలుగుదనాన్ని కలుషితం చేసే కథ ఇది. ఇప్పటికే పాశ్చాత్య కల్చర్ మనవారిని పాడుచేస్తుంది. సినిమా పరంగా మరో ముందడుగు వేసిందనడంలో సందేహమే లేదు. ఇలాంటి కథలు ఇంగ్లీషులో చాలానే వచ్చాయి. ఈమధ్యనే సంజయ్ లీలా బన్సాలీ తాను తీసిన 'హమ్ దిల్ దే చుకే సనమ్' సినిమాను పోలి వుందనే అనుమానం కూడా వ్యక్తం చేశాడు. కానీ పూర్తిగా అదికాదని.. సహ నిర్మాత కోన వెంకట్ క్లారిటీ ఇచ్చాడు. అప్పట్లో హిందీలో 'ఢర్' అనే సినిమా కూడా వచ్చింది.
ఏది ఏమైనా.. చిత్రంలో బలవంతపు సన్నివేశాలున్నాయి. ఏడాదిపాటు ప్రేమించిన పల్లవి... తాను పెండ్లి చేసుకుంటున్నాననే విషయాన్ని నానికి ఆ తర్వాత కూడా చెప్పకపోవడం చిత్రమే. పదిరోజుల పాటు తన ఇంట్లో ఉండమని ఆహ్వానించడమే మరీ చిత్రం. దీనికి ఆమె భర్త ఆది కూడా.. అంగీకరిస్తాడు. దానికి చివర్లో ఓ క్లారిటీ.. తాను ప్రేమించిన జెన్నీ అనే అమ్మాయి.. ఆత్మహత్యలాంటిది చేసుకుందనీ.. అది నువ్వు చేసుకోకూడదని లాజిక్కుతో నిన్ను రమ్మన్నానని ఆది.. నానితో వెల్లడిస్తాడు.
ఇలా ఏదోవిధంగా సన్నివేశాలు కలిపి.. ప్రేమించి పెండ్లి చేసుకోవడమే కాదు.. పెండ్లయ్యాక కూడా ప్రేమించవచ్చని గొప్ప నీతిని చెప్పారు. ఇది కేవలం ఓవర్‌సీస్‌లోని తెలుగువారి కోసం తీసిన సినిమా. దాన్ని మనవారు ఆదరిస్తారనేది సందేహమే. కేవలం మల్టీప్లెక్స్ థియేటర్లకే పరిమితం అవుతుంది.
సంగీతపరంగా శేఖర్ చంద్ర బాణీలు పర్వాలేదు. కానీ రీరికార్డింగ్ మరీ దారుణంగా వుంది. ప్రతి సీన్‌కు బ్యాక్‌గ్రౌడ్ డిస్టబ్‌గా వుంది. కెమెరా పనితనం ఓకే. నాని నటనాపరంగా, నివేద ఇద్దరూ బాగానే నటించారు. తమిళ నటుడు ఆది కాబట్టి ఈ పాత్ర చేశాడు. తెలుగు నటుడు చేయడం కష్టమే. దర్శకుడిగా తొలిసారైనా శివ ఎంచుకున్న కథ తెలుగు కల్చర్‌పై విషబీజాలు నాటుకునేలా వుంది.
రేటింగ్: 1.5/5
- పెండ్యాల మురళీ