శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 27 ఆగస్టు 2021 (07:00 IST)

క‌రోనాలో పిసినారి పెల్లి భోజనం

Vivaha bhojanambhu
న‌టీన‌టులుః కమెడియన్ సత్య, అర్జావీ రాజ్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, సుబ్బరాయ శర్మ, టీఎన్ఆర్, వైవా హర్ష, శివన్నారాయణ, మధు మణి, నిత్య శ్రీ, కిరీటి, దయ, కల్ప లత తదితరులు 

వివాహ భోజనంభు
సాంకేతిక‌తః  సంగీతం - అనివీ, సినిమాటోగ్రఫీ - మణికందన్, ఎడిటింగ్ - ఛోటా కె ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్ - బ్రహ్మ కడలి, కొరియోగ్రఫీ - సతీష్, విజయ్, కథ - భాను భోగవరపు, మాటలు - నందు ఆర్ కె, సాహిత్యం - కిట్టు, కృష్ణ చైతన్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - సీతారాం, శివ చెర్రి, నిర్మాతలు - కేఎస్ శినీష్, సందీప్ కిషన్, దర్శకత్వం - రామ్ అబ్బరాజు.
 
లాక్‌డౌన్ స‌మ‌యంలో ప్ర‌జ‌లు ఎన్ని ఇబ్బందులు ప‌డ్డారో తెలిసిందే. ఆ స‌మ‌యంలో పెండ్లిచేసుకోబోయే జంట ఒక‌ట‌వ్వాల‌నుకుంటారు.అనంత‌ర ప‌రిణామాలు ఎలా వుంటాయ‌నే కాన్సెప్ట్‌తో వివాహ భోజనంబు చిత్రం రూపొందింది. క‌మేడియ‌న్ స‌త్య ఇందులో హీరోగా మారాడు. హీరో సందీప్‌కిష‌న్ నిర్మాత‌గా మారాడు. అంత‌లా సందీప్‌ను ఆక‌ట్టుకున్న అంశంఏమిటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఆగస్టు 27న 'సోని లివ్' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మ‌రి అదెలా వుందో చూద్దాం.
 
క‌థః 
స‌త్య న‌లుపు. చ‌దువులేదు. పెద్ద అంద‌గాడు కాదు. పిసినారి కూడా. కానీ అతన్ని అర్జావీ రాజ్ ప్రేమిస్తుంది. కూతురు నిర్ణ‌యం తీసుకున్నాక విష‌యం తెలుసుకున్న అర్జావీ రాజ్ తండ్రి అంగీక‌రించ‌డు. కానీ తాత సుబ్బ‌రాయ‌శ‌ర్మకు స‌త్య ఇంటిపేరు, ఒకే ఊరు అని తెలియ‌డంతో ఒప్పుకుని పెండ్లివ‌ర‌కు తీసుకువ‌స్తాడు. ఎంతో ఆర్భాటంగా చేయాల‌నుకున్న పెండ్లికి క‌రోనా నిబంధ‌న‌ల ప్ర‌కారం కొద్దిమందితో ముగించేస్తారు. ఆచారం ప్ర‌కారం పెండ్లి కొడుకు ఇంటిద‌గ్గ‌రే పెండ్లిచేయ‌డంతో పెండ్ల‌యిన త‌ర్వాత మోడీ లాక్‌డౌన్ ప్ర‌క‌టిస్తాడు. దాంతో గ‌త్యంత‌రం లేక ప‌దిమంది కుటుంబీకులు పిసినారి అల్లుడు ఇంటిలోనే మ‌కాం పెట్టాల్సివ‌స్తుంది. కానీ ఏదోర‌కంగా వీరిని బ‌య‌ట‌కు పంపాల‌ని స‌త్య చూస్తుంటాడు. ఆ త‌ర్వాత ఏమ‌యింది? స‌త్య ఎత్తులు పారాయా? అస‌లు స‌త్య‌ను ఆమె ఎందుకు ప్రేమించింది?  ఇందులో సందీప్ పాత్ర ఏమిటి? అనేది మిగిలిన సినిమా.
 
విశ్లేష‌ణః 
 
పిసినారి క‌థ‌ల‌కు కేరాఫ్ అడ్రెస్ రాజేంద్ర‌ప్ర‌సాద్ సినిమాలే. అహ‌నా పెల్ళంట అందులో హైలైట్‌. అందులో పాత్ర అంత కాక‌పోయినా కొద్దిగా స‌త్య పాత్ర‌లో వుంటాయి. ప్ర‌మోష‌న్‌ సాంగ్‌లో ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు బ‌య‌ట‌పెట్టాడు. అయితే ఇప్ప‌టిట్రెండ్‌ను బ‌ట్టి స‌త్యను క‌థానాయ‌కుడిగా చేస్తే ఎలా వుంటుంద‌నే ఆలోచ‌న‌లోంచే ఈ క‌థ పుట్టిన‌ట్లుంది. క‌రోనా కాలం కాబ‌ట్టి ఒకే ఇంటిలో ఒకే ఊరిలో న‌టీన‌టుల‌తో చాక‌చ‌క్యంగా ద‌ర్శ‌కుడు క‌థ‌ను రాసుకున్నాడు. ముఖ్యంగా పిసినారిపై అద‌న‌పు భారం ప‌డితే ఎలా వుంటుంద‌నే పాత్ర‌లో స‌త్య అమ‌రాడు. ఇష్టంలేని వ్య‌క్తి అల్లుడ‌యితే ఫీలింగ్ ఎలా వుంటాయ‌నేది అయ్యంగార్ బాగా మెప్పించాడు. తాత‌గా సుబ్బ‌రాయ‌శ‌ర్మ స‌రిపోయాడు. మిగిలిన పాత్ర‌లు ప‌రిధిమేర‌కు న‌టించాయి. 
 
సందీప్ కిషన్ నిర్మిస్తూ అంబులెన్స్ డ్రైవ‌ర్ పాత్రలో నటించాడు. ఆ పాత్ర‌వ‌ర‌కు కాస్త విభిన్నంగా అనిపిస్తుంది. ఈ సినిమాను వాస్తవ ఘటనల స్ఫూర్తితో  రూపొందించిన‌ట్లు దర్శకుడు రామ్‌ అబ్బరాజు వెల్ల‌డించాడు. కానీ ఆ సంఘ‌ట‌న‌ల‌కు ఇంకాస్త పోష‌కాలు స‌మ‌కూర్చుకోవాల్సింది. వివాహ భోజ‌నంలో వంటాకాలు ముఖ్యం. వాటిలో అన్ని వంట‌కాలు బాగుంటేనే మంచి రుచిక‌రమైన భోజ‌నం తిన్నామ‌న్న తృప్తి వుంటుంది. అది ఈ సినిమాలో లోపించింద‌నే చెప్పాలి. పాల‌ల్లో నీళ్ళు క‌లిపి టీ పెట్టిన‌ట్లు, శానిటైజ‌ర్లో స‌త్య నీళ్లు క‌ల‌ప‌వ‌డం వంటి చిన్న‌పాటి స‌న్నివేశాలు కాస్త వినోదాన్ని పండించినా మొత్తంగా చూస్తే ప‌ప్పులో కాస్త నీళ్ళు ఎక్కువైతే సాంబార్ అయిన‌ట్లుగా క‌థ త‌యారైంది. ద‌ర్శ‌కుడు మ‌రింత శ్ర‌ద్ధ పెడితే వినోదం పాళ్ళు బాగుండేవి.
అందంకంటే గుణం ముఖ్యం. ఇంటిపేరుకంటే మ‌న‌సు ముఖ్య‌మ‌నే విష‌యాన్ని చివ‌రిలో ద‌ర్శ‌కుడు చెప్పాడు. దాన్ని మ‌రింత ఎఫెక్ట్‌గా రాసుకుంటే బాగుండేది. ఓవర్ అల్ గా వివాహ భోజనం రుచి త‌క్కువ చ‌ప్ప‌ద‌నం ఎక్కువ‌గా వుంది.
రేటింగ్ః 2.5/5