గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : బుధవారం, 19 జులై 2023 (17:11 IST)

స్వచ్ఛమైన గ్రామీణ గుబాళింపు అన్నపూర్ణ ఫొటో స్టూడియో - రివ్వ్యూ

Annpurna stuido photo
Annpurna stuido photo
చైతన్య రావ్, లావణ్య జంటగా నటించిన చిత్రం అన్నపూర్ణ ఫోటో స్టూడియో. ఈ చిత్రాన్ని బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించారు. చెందు ముద్దు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషించారు.
 
అన్నపూర్ణ ఫొటో స్టూడియో చిత్రం 80వ దశకంలో గ్రామీణ నేపథ్యంలో వస్తోంది అనగానే అప్పటి వాతావరణం ఉట్టిపడేలా వుంటుందని ప్రచార పోస్టర్లలో తెలిసిపోయింది. అమరికలు లేని మనుషుల తత్త్వంతోపాటు పచ్చటి పొలాలు అప్పుడే చిగురించే యువతీ యువకుల ప్రేమకథ అన్నీ మన కళ్ళముందుకు తీసుకువస్తుందని దర్శక నిర్మాతలు చెబుతూ వచ్చారు. కొత్తవారితో దర్శక నిర్మాతలు చేసిన ఈ సినిమా జులై 21న విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా చిత్రంపై తమకున్న పూర్తి నమ్మకంతో ప్రముఖులకు ముందుగానే ప్రివ్యూ ప్రదర్శించారు. మరి ఆ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ:
పచ్చటి పొలాలు, మట్టిరోడ్లు వున్న ఓ విలేజ్‌లో చావుబతుకులమధ్య వున్న చైతన్యరావ్‌ను పోలీసులు ఆసుపత్రిలో జాయిన్‌ చేస్తారు. అతను రాసిన సూసైడ్‌ నోట్‌ను చదివే క్రమంలో కథ సాగుతుంది. ఆ ఊరిలో కాలేజీ చదువు పూర్తయి వయస్సు మీదపడినా పెండ్లికాని ప్రసాద్‌లా మిగిలిపోతాడు చైతన్యరావ్‌. ఆ ఊరిలో తన తల్లిపేరుతో అన్నపూర్ణ ఫొటోస్టూడియోను నడుపుతుంటాడు. ఊరిలో ఎటువంటి కార్యక్రమాలు జరిగినా ఫొటోలు, వీడియోలు తీస్తుంటాడు. చైతన్యరావ్‌కు ఫ్రెండ్స్‌కూడా వుంటారు. ఓసారి ఫ్రెండ్స్‌ వేసిన సైకిల్‌ పందెంలో పొల్గొన్న చైతన్యరావ్‌ పక్క ఊరినుంచి సైకిల్‌పై వస్తున్న లావణ్యను ఢీ కొడతాడు. దాంతో తొలిచూపుతోనే ఆమెను ప్రేమిస్తాడు. ఆ తర్వాత తన చెల్లెలు పద్దుకు ఫ్రెండ్‌ అయిన లావణ్య తరచూ ఇంటికి రావడంతో ఇద్దరూ ఒకరినొకరు ప్రేమలో పడిపోతారు. కథ సాఫీగా సాగుతుండగా నాటకీయంగా ఓ మర్డర్‌ కేసులో చైతన్యరావ్‌ ఇరుక్కుంటాడు. దాన్ని ఫొటో తీసిన జగదీష్‌ అనే వ్యక్తి చైతన్యరావ్‌ను బ్లాక్‌మెయిల్‌ చేస్తూ సింధు అనే అమ్మాయిని చంపితేనే నీకు ఫొటోలు తిరిగి ఇస్తానని బెదిరిస్తాడు. ఆ తర్వాత చైతన్యరావ్‌ ఏం చేశాడు? అసలు సింధు ఎవరు? లావణ్య ప్రేమ ఏమయింది? వయస్సుమీదపడినా పెండ్లికాకుండా చైతన్యరావ్‌ ఎందుకున్నాడు? అనే వాటికి సమాధానమే మిగిలిన సినిమా.
 
విశ్లేషణ:
సహజంగా గ్రామమంటేనే చక్కటి పొలాలు, కాలువలు, సెలయేళ్లు, కల్మషంలేని మనుషులు కనిపిస్తారు. 80వ దశంలో కథ కాబట్టి దానికి తగినట్లు చక్కటి గ్రామాన్ని ఎంపికచేసుకున్నాడు దర్శకుడు. గ్రామీణ కథతో సినిమాలు కొత్తేమీకాదు. చాలా కథలున్నాయి. గతంలో లేడీస్‌ టైలర్‌కానీ, ఏప్రిల్‌1 విడుదలకానీ పెద్ద వంశీచిత్రాలుకానీ చాలానే వచ్చాయి. గ్యాప్‌ చాలా వుండడంతో ఆ తరహాలో దర్శకుడు చెందు వెళ్ళాడు. ఇందులో హీరోకు వయస్సు వచ్చినా పెండ్లికాదు అనే పాయింట్‌ సరికొత్తగా అనిపిస్తుంది. అలా ఎందుకనేది ముగింపు దాకా తీసుకువచ్చి సస్పెన్స్‌లో పెట్టాడు దర్శకుడు. హీరో హీరోయిన్ల మధ్య సాగే లవ్‌ ట్రాక్‌, సన్నివేశాలు చాలా సరదాగా ఎంటర్‌టైన్‌ ఇస్తాయి. హీరోయిన్‌ను చూడగానే రంగమ్మ అనే సాంగ్‌ రావడం చాలా ఆసక్తిగా అనిపిస్తుంది. కానీ అది పూర్తినిడివి సాంగ్‌లేకపోవడంతో కొంత ఆడియన్స్‌కు నిరాశ కలిగిస్తుంది. ఇద్దరూ కొత్తవారు కావడం అప్పుడే చిగురించిన పువ్వులా లావణ్య పాత్ర అందంగా వుంటుంది. వయస్సుమీద పడినా హీరో పాత్రకు యూత్‌ బాగా కనెక్ట్‌ అవుతారు. వారి నటన స్వచ్చంగా వుంది. వారితోపాటు వారి స్నేహితులుకూడా బాగా నటించారు.
 
మొదటి భాగం చాలా సరదాగా సాగుతూ ఇంటర్‌వెల్‌ ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలు, పాత్రలు బాగున్నాయి. జగదీష్‌ పాత్రను నిర్మాత యష్‌ రంగినేని పోషించారు. కాలేజీలో విద్యార్థుల మధ్య సాగే ఫైట్‌ రియలస్టిక్‌గా వుంది. ఈ కథను హీరో రాసిన సూసైడ్‌ నోట్‌ను చదువుతూ పోలీసులు చెప్పడంతో ఒకస్థాయిలో చికాకు పుట్టిస్తుంది. అన్నిసార్లు కాకుండా రెండు, మూడు సార్లు అయితే బాగుండేదనిపిస్తుంది. ఇక ఇందులో నటించిన మిగిలిన నటీనటులు బాగానే చేశారు. 
 
ప్రిన్స్‌ హెన్రీ సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం సన్నివేశపరంగా పొందికగా చేశాడు. పంకజ్‌ సినిమాటోగ్రఫీ సినిమాకు కీలకం. ప్రతి సన్నివేశాన్ని ఓ ఆర్ట్‌లా చూపించాడు. ఎస్‌.పి. చరణ్‌ పాడిన రంగమ్మ సాంగ్‌ బాగుంది. ఎడిటింగ్‌ ఓకే. చిన్నపాటి లోపాలున్నా కథకు దర్శకుడు చెందు సరైన న్యాయం చేశాడు. ఇలాంటి గ్రామీణ మట్టివాసన కథలు ఇతర భాషల్లో బాగానే ఆదరణ పొందుతున్నాయి. అందుకే రొటీన్‌ కథ కాకుండా కాస్త భిన్నమైన అంశాన్ని ఎంచుకుని వల్గారిటీకి తావులేకుండా దర్శక నిర్మాతలు చేసిన ప్రయత్నం అభినందనీయం. నిజాయితీగా తీసిన సినిమా ఇది. అందుకే విడుదలకు ముందుగానే ఈటీవీ విన్స్ సంస్థ ప్రసార హక్కులు పొందింది. థియేటర్ లో ఇప్పటితరం ఆదరణబట్టి సినిమా స్థాయి పెరిగే సూచనలు ఉన్నాయి.
రేటింగ్‌: 3/5