బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By
Last Updated : ఆదివారం, 22 సెప్టెంబరు 2019 (10:29 IST)

ప్రధాని సైతం కార్పొరేట్‌ దిగ్గజ్జాల కీలుబొమ్మేనా? ఆలోజింపచేసే 'బందోబస్త్‌'.. (మూవీ రివ్యూ)

నటీనటులు : సూర్య, మోహన్‌ లాల్‌, ఆర్య, సయేశా, బోమన్‌ ఇరానీ తదితరులు.
సాంకేతికత: 
సినిమాటోగ్రఫర్‌: ఎం ఎస్‌ ప్రభు, 
సంగీతం: హరీష్‌ జయ్‌ రాజ్‌, 
నిర్మాతలు : సుభాస్కరన్‌ అల్లిరాజా, 
ఎడిటర్‌ : ఆంటోనీ
దర్శకత్వం : కె వి ఆనంద్‌.
 
సినిమా సినిమాకూ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ కొత్తగా కన్పించే నటుడు సూర్య. రొటీన్‌ ఫార్ములాకూ భిన్నంగా కథాంశాల్ని ఎంచుకునే ఆయన ఈసారి వర్తమాన రాజకీయాలు, రైతుల సమస్యల్ని, పాలకులపై పెట్టుబడిదారుల పెత్తతనం, యాక్షన్‌ అంశాల్ని కథావస్తువుగా ఎంచుకున్నాడు. ఇందుకు 'రంగం' వంటి చిత్రానికి దర్శకత్వం వహించిన కె.వి. ఆనంద్‌ను దర్శకుడిగా తీసుకున్నాడు. మోహన్‌లాల్‌, ఆర్య వంటి నటులు వుండడంతో సినిమాపై క్రేజ్‌ ఏర్పడింది. తమిళ చిత్రానికి డబ్బింగ్‌ అయిన ఈ చిత్రం శువ్రకారమే విడుదలైంది. మరి ఎలా వుందో చూద్దాం. 

కథ :
గోదావరి జిల్లాలో ప్రకృతి వనరులతో వ్యవసాయం చేసే రవి కిశోర్‌ (సూర్య)కు దేశమంటే అభిమానం. ప్రధానమంత్రిని రక్షించడానికి వెన్నంటి వుండే సీక్రెట్‌ ఆఫీసర్‌ కూడా. అది బయట ప్రపంచానికి తెలీదు. ఇక భారత ప్రధాని చంద్రకాంత్‌ వర్మ (మోహన్‌ లాల్‌) ప్రజల మేలు కోరే నాయకుడు. దేశానికి కీడు చేస్తోన్న వారిపై యాక్షన్‌ తీసుకోవటానికి ఆర్డర్స్‌ పాస్‌ చేస్తాడు. ఆ యాక్షన్‌ టీమ్‌లో రవి కిషోర్‌ (సూర్య) ఒకడు. విధినిర్వహణలో చంద్రకాంత్‌ వర్మకి దగ్గరై ప్రధానికి పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా నియమించబడతాడు. 
 
అక్కడ పనిచేసే అంజలి (సయేషా సైగల్‌)తో ప్రేమలో పడతాడు రవి కిషోర్‌. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఉగ్రవాదుల దాడిలో ప్రధాని చనిపోతారు. క్యాబినెట్‌ అత్యవసర సమావేశమై చంద్రకాంత్‌ వర్మ కొడుకు ఆర్యను ప్రధానమంత్రి చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ప్రధానిని చంపింది ఎవరు? ఇందులో కార్పొరేట్‌ దిగ్గజం మహావీర్‌ (బోమన్‌ ఇరానీ) పాత్ర ఏమిటి? అనేవి వెండి తెర పై చూడాల్సిందే.
 
విశ్లేషణ:
ఇది ఫక్తు వర్తమాన భారత రాజకీయచిత్రమే. దేశ ప్రధాని కార్పొరేట్‌ దిగ్గజ్జాల కీలుబొమ్మే. వారు చెప్పింది చేయాలి. లేదంటే ఎందుకైనా తెగిస్తారు. ఢిల్లీలో ప్రధాని చుట్టూ జరిగే విషయాలకు కారణాలు బయటకు తెలీవు. అవన్నీ ఎలా వుంటాయనేది కళ్ళకు కట్టినట్లు దర్శకుడు ఆనంద్‌ చెప్పగలిగాడు. కార్పొరేట్‌ వ్యక్తులే ప్రభుత్వాన్ని శాసిస్తాయనేది డొంకతిరుగుడులేకుండా దర్శకుడు నేరుగా చెప్పేశాడు. 
 
ఇండియాను సూపర్‌పవర్‌ చేస్తానంటూ పైకి చెబుతూనే ఆ సాకుతో తన వ్యాపారసామ్రాజ్యాన్ని దేశ విదేశాల్లో ఎలా విస్తరించవచ్చో అనేది కార్పొరేట్‌ వ్యాపారి ద్వారా క్లారిటీ ఇస్తాడు. గోదావరి జిల్లాలోని గనుల్ని స్వాధీనం చేసుకోవడం కోసం రైతుల నుంచి బలవంతంగా పొలాల్ని లాగేసుకోవడం వంటి సన్నివేశాలు ఆశ్చర్యాన్ని కల్గిస్తాయి. పండిన పొలాల్లో బయో కీటకాలతో దాడిచేయిస్తూ రైతుల ధైర్యంపై దెబ్బగొట్టడం, ఇవన్నీ తెలిసినా ప్రభుత్వం ఏమీ చేయలేని స్థితిలో వుండేలా చేయడమే కార్పొరేట్‌ కల్చర్‌. 
 
అయితే దీనిపై ఆర్‌.నారాయణమూర్తితో సహా పలువురు పలు చిత్రాలు నిర్మించారు. కానీ సూర్య నటించిన 'బందోబస్త్‌' చిత్రం అటు రైతు సమస్యలు, ఇటు దేశంలో ప్రధాన సమస్యల్ని ముడిపెడుతూ లాజిక్క్‌గా బాగా చూపించాడు. ఏ దేశమైనా ఒక్కసారిగా కుప్పకూలితే దాని వెనుక కార్పొరేట్‌ హస్తం వుంటుందంటూ నొక్కి చెప్పాడు. బొమనన్‌ ఇరానితో ఓ డైలాగ్‌ వుంటుంది. 'ఇథోపియాలో కాపర్‌ ఫ్యాక్టరీ వుండేది. ఐదేళ్ళ క్రితం పర్యావరణం దెబ్బతింటుందంటూ అప్పటి ప్రభుత్వం మూసేసింది. 20 మిలియన్‌ డాలర్లు ఖర్చుచేసి వ్యతిరేక గ్రూప్‌ను అధికారంలోకి తెచ్చా. ఇప్పుడు 14 ఫ్యాక్టరీలు వున్నాయి. అందుకే మాలాంటి వారిని వ్యతిరేకిస్తే అధికారాన్ని కూలదోస్తానంటూ' కొత్త ప్రధానిని హెచ్చరిస్తాడు. 
 
ఇకపోతే ఇరానీ పాత్ర అంబానీ కుటుంబాన్ని రిలవెంట్‌గా వుంటుంది. తాను పెట్రోల్‌ బంకులో పనిచేశాను. చిన్నచిన్నగా ఎదిగానంటూ చెప్పే విధానం అంబానీని గుర్తు చేస్తుంది. ముఖ్యంగా దేశంలో కాశ్మీర్‌ సమస్య తీవ్రమైంది. ఆ సమస్యకు కారణం నాయకులేకాదు. కార్పొరేట్‌ శక్తులు కూడా. ఆ శక్తుల వల్లే కాశ్మీర్‌ ఇన్నాళ్ళు గొడవలతో రాజుకుంటుంది. ఈ విషయాన్ని చాలా స్పష్టంగానూ చెప్పాడు. ఇక కార్పొరేట్‌ వ్యవస్థ దృష్టిలో ప్రధాని సీక్రెట్‌ ఆఫీసర్‌ కూడా వాచ్‌మెన్‌ లాంటివాడే. ఇవన్నీ సందర్భానుసారంగా కె.వి. ఆనంద్‌ రాసుకున్న సంభాషణలు ఆలోజింపచేస్తాయి.
 
ఇంకోవైపు ప్రకృతి సాయంతో వ్యవసాయం చేసే వ్యక్తి మానవ వనరుల్ని నమ్ముకున్నాడు. అంటే గోబర్‌ గ్యాస్‌ తరహాలో మనిషికి సంబంధించిన మలినాల్ని ఎరువుగా వేయడమే. దాన్ని పొలానికి ఎరువుగా వేస్తే విత్తనానికి సత్తువ ఇస్తూ పంట రెట్టింపు వస్తుంది.. అనే విధానాన్ని కొత్తగా చెప్పాడు. ఈ పద్ధతి చైనా, జపాన్‌లో వున్నదే. మొక్కలకు ఎరువుల రూపంలో అడ్డమైన కెమికల్స్‌తో నేలను గొడ్రాల్ని చేస్తున్నామంటూ.. రాసిన డైలాగ్స్‌ బాగున్నాయి. 
 
అసలైన దేశద్రోహులు కార్పొరేట్‌ శక్తులే. వారి ముందు చేతులు కట్టుకుని కూర్చునే చట్టం.. 'తగిన న్యాయం జరగలేదని ఎదిరించే మనిషిని, హెల్మెట్‌ పెట్టుకోని వ్యక్తిని, రోడ్‌పై టీతాగుతుంటే ఏదో కారణంతో తీసుకుళ్ళేవాడిని నేరస్తునిగా చూపుతుందేకానీ మన దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తున్న కార్పొరేట్‌ వ్యవస్థను ఏమీ చేయలేకపోతుందంటూ.. సూర్య పలికే డైలాగ్స్‌ హైలైట్‌గా నిలిచాయి.  
 
అలాగే సినిమాలో ఇంటర్వెల్‌ బ్యాంగ్‌, క్లైమాక్స్‌లో వచ్చే కొన్ని సీన్స్‌ అలరిస్తాయి. ప్రధానంగా సినిమాలో పీఎం చంద్రకాంత్‌ వర్మ (మోహన్‌ లాల్‌) పాత్ర హత్య జరగడం. ఆ పాత్రకు సంబంధించిన ట్రాక్‌.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన సూర్య మిగిలిన ప్రధాన పాత్రలు.. అలాగే సినిమాలోని కొన్ని విచారణ సన్నివేశాలు వంటి అంశాలు సినిమాకే ప్లస్‌ పాయింట్స్‌గా నిలుస్తాయి. సయేషా సైగల్‌ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. కీలక పాత్రలో నటించిన హీరో ఆర్య కూడా తన నటనతో ఆకట్టుకుంటాడు. 
 
అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు బోమన్‌ ఇరానీ, సముద్రఖని, పూర్ణ, తమ నటనతో ఆకట్టుకున్నారు. దర్శకుడు రాసుకున్న కాన్సెప్ట్‌, కొన్ని యాక్షన్‌ సన్నివేశాలు బాగున్నప్పటికీ చాలామటుకు సినిమాటిక్‌గా మార్చేశాడు. సీరియస్‌ పాయింట్‌లో లవ్‌సీన్స్‌లో కామెడీ వుండేలా చూసుకున్నాడు.  సెకెండ్‌ హాఫ్‌ బాగా స్లోగా సాగడం, ప్రీ క్లైమాక్స్‌ ఎక్కువ సేపు సాగడం వంటి అంశాలు సినిమాకి మైనస్‌ పాయింట్లుగా నిలిచాయి. 
 
కెమెరామెన్‌ ప్రభు సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. కొన్ని యాక్షన్‌ సన్నివేశాల్లో ఆయన పనితనం చాలా బాగుంది. సంగీత దర్శకుడు హరీష్‌ జయ్‌ రాజ్‌ అందించిన నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా యాక్షన్‌ సీక్వెన్స్‌స్‌లో నేపథ్య సంగీతం  బాగుంది. ఎడిటర్‌ వర్క్‌ సినిమాకి తగ్గట్లు ఉంది. 
 
నిర్మాత సుభాస్కరన్‌ అల్లిరాజా పాటించిన ప్రొడక్షన్‌ వాల్యూస్‌ చాలా బాగున్నాయి. ఇక దర్శకుడు మంచి కథాంశం తీసుకున్నా.. ఆ కథాంశానికి తగ్గట్లు ఉత్కంఠభరితమైన కథాకథనాలను రాస్తే సినిమా మరో స్థాయిలో ఉండేది. యాక్షన్‌ మూవీస్‌ ఇష్టపడేవారికి నచ్చడంతోపాటు ఏదో కొత్త విషయాన్ని తెలుసుకున్నామన్న అంచనాకు ప్రేక్షకుడు వస్తాడు.