సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (14:12 IST)

ఖుషీ ఖుషీగా విజయ్‌ దేవరకొండ, సమంతల ప్రేమ కథ: రివ్యూ

SAM-vijay
SAM-vijay
నటీనటులు: విజయ్ దేవరకొండ- సమంత- మురళీ శర్మ- సచిన్ ఖేద్కర్- శరణ్య పొన్ వన్నన్-లక్ష్మి- రోహిణి- జయరాం- వెన్నెల కిషోర్- రాహుల్ రామకృష్ణ- శరణ్య ప్రదీప్- శ్రీకాంత్ అయ్యంగార్-శత్రు తదితరులు 
 
సాంకేతికత: సంగీతం: అబ్దుల్ హేషమ్ వహాబ్ ఛాయాగ్రహణం: మురళి.జి నిర్మాతలు: యలమంచిలి రవిశంకర్-నవీన్ ఎర్నేని రచన-దర్శకత్వం: శివ నిర్వాణ 
 
కథ:
విప్లవ్‌ (విజయ్‌ దేవరకొండ) తండ్రి లెనిన్‌ సత్యం (సచిన్‌ ఖడేకర్‌) పరమ నాస్తికుడు. రాష్ట్ర అధ్యక్షుడు కూడా. తల్లి అంతర్లీన భక్తురాలు. విప్లవ్‌కు హైదరాబాద్‌లో బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌.లో ఉద్యోగం వస్తే ఇక్కడంతా రొటీన్‌ అని కొత్త ప్రదేశం కావాలంటాడు. అందుకే ఆఫీసర్‌ లక్ష్మీ (రోహిణి జయరాం) కాశ్మీర్‌లో పోస్టింగ్‌ వేస్తుంది. అక్కడ అందమైన కొండలు, మంచు, స్వచ్చమైన గాలి చూసి జన్మధన్యమైపోయిందనుకుంటాడు విప్లవ్‌. కానీ మొదటిరోజే అక్కడ పాకిస్తాన్‌, ఇండియా బోర్డర్‌ మధ్య కాల్పులు, బాంబ్‌ బ్లాస్ట్‌లు జరగడం, ఇతర కారణాలతో తిరిగి రావాలనుకుంటాడు.

సరిగ్గా ఆ టైంలో ముస్లిం డ్రెస్‌లో వున్న ఆరాధ్య (సమంత)ను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఆమె ప్రేమకు ఏదైనా చేయడానికి తెగిస్తాడు. అలా కొన్ని సంఘటనలు జరిగాక తను ముస్లింకాదని పక్కా బ్రాహ్మీణ్‌ అనీ, మా నాన్న కాకినాడలో పెద్ద ప్రవచనకర్త (మురళీశర్మ) అని చెప్పేస్తుంది. సహజంగానే ఇరు భిన్న దృవాల కుటుంబాలు వీరి పెండ్లికి ససేమిరా అంటాయి. ఆ సమయంలో ఇద్దరూ ఇంటి నుంచి బయటకు వచ్చేసి వేరే కాపురం పెడతాడరు. ఆ తర్వాత జరిగిన కథే మిగిలిన సినిమా.
 
విశ్లేషణ:
దర్శకుడు శివ నిర్వాణ ఇంతకుముందు ఫెయిల్‌ అయిన ప్రేమకథలు తీశారు. ఇప్పుడు సక్సెస్‌ అయిన ప్రేమ కథ చెప్పాడు. ఆ క్రమంలో ఆ తర్వాత వారి ఆలోచనలు, ఇగోలతో కాపురాన్ని ఏవిధంగా తీసుకున్నారు. ఇందులో దేవుని పాత్ర ఎంతవరకు వుంది అనేది టచ్‌ చేశాడు. పరమ ఆస్తికుడు, చాంధసవాది అయిన మురళీ శర్మ, మనిషి పుట్టుకే సైన్స్‌. దేవుడిది ఏమీలేదు. అంతా బూటకం అనే పరమ నాస్తికుడు మధ్య జరిగిన సంవాదాలు, సన్నివేశాలు ఎంటర్‌టైన్‌ చేస్తాయి. విజయ్‌, సమంతల మధ్య జరిగే సంఘటనలు ప్రేమకు దారితీసే సన్నివేశాలు కూడా పూర్తి వినోదాన్ని అందించాయి. అందులో వెన్నెల కిశోర్‌ పాత్ర అలరిస్తుంది. మిగిలిన పాత్రలు వారి పాత్రలకు న్యాయం చేశారు.
 
నటనాపరంగా విజయ్‌  దేవరకొండకు ఇటువంటి పాత్ర కొట్టినపిండే. సమంతకూ అంతే. ఇద్దరూ కూడా తమ ఇగోలతో ఎలా కాపురం చేశారనే పాయింట్‌ ఆసక్తికరంగా వుంటుంది. అలా అని సరికొత్త కథ కూడా కాదు. వీరి ప్రేమకథ చూశాక సమంత లవ్‌ స్టోరీని టచ్‌ చేశాడా? దర్శకుడు తన ప్రేమకథను చూపించాడా? అన్నది ప్రేక్షకులకు వదిలేశాడు. ఎందుకంటే ఇటువంటి కథ కొన్ని అనుభవాలనుంచి తీసుకున్నామని విడుదలకు ముందు శివ నిర్వాణ చెప్పడమే కారణం. అలా అని సమంత లవ్‌స్టోరీ కాదని కూడా అన్నారు. ఇక సినిమా కథనంలో క్రిస్టియన్‌లైన రోహిణి, జయరాం జంటను పెట్టి వారి కుమార్తె ఫంక్షన్‌కు విజయ్‌, సమంత కేరళకు వెళ్ళడం వంటివి సమంత తొలి సినిమా ఏ మాయచేసావేను ఒక్కసారైనా గుర్తుకు తెచ్చుకునేలా చేస్తాయి.
 
ఈ సినిమాలో ముఖ్యంగా చర్చించదగిన అంశాలు ఎవర్‌గ్రీన్‌ అంశమని చెప్పాల్సిందే. దేవుడు లేడని వాదించేవారికీ, దేవుడు వున్నాడని బల్లగుద్ది మరీ చెప్పేవారికి మధ్య జరిగే కథ. ఇందులో ఎవరూ ఎక్కువ తక్కువ కాదు. ఒకరిపై ఒకరు ద్వేషంతో మాట్లాడుకోవడం, అరుచుకోవడం, విమర్శించుకోవడం అనేవి కాకుండా ఈ సృష్టిలో మనం మనుషులం అనే విషయాన్ని గ్రహించాలి అనే పాయింట్‌ను దర్శకుడు చెప్పాడు. ఆ క్రమంలో తమతమ ఇగోలను, నమ్మకాలను, చాదస్తాలను, సిద్దాంతాలను పక్కన పెట్టి బిడ్దలపై ప్రేమను ఆస్వాదించడమే ఈ సినిమా సారాంశం. ఇందులో దర్శకుడు సఫలీకృతుడయినా ముగింపు అర్థంతరంగా ముగించాడు.
 
అలాగే విజయ్‌దేవరకొండ పనిమనిషితో నేను స్త్రీ పక్షపాతి అనే సీన్‌కు సరైన లింక్‌ మిస్‌ అయింది. మొదటి భాగంలో వెన్నెలకిశోర్‌, సెకండాప్‌లో రాహూల్‌ రామకృష్ణ ఎంటర్‌టైన్‌ చేస్తారని విజయ్‌ చెప్పాడు. కానీ అంతలేకపోయినా పర్వాలేదు అనిపించేలా వుంది.
 
టెక్నికల్‌గా. మురళీ సినిమాటోగ్రఫీ కనులవిందుగా వుంది. సంగీతం వీనుల విందుగా వుంది. సన్నివేశాలు, లొకేషన్‌, గాయకుల గాత్రం, నేపథ్య సంగీతం బాగున్నాయి. ఫీల్‌గుడ్‌ రొమాంటిక్‌ మూవీగా వుంది. డైలాగ్‌లు కూడా బాగున్నాయి. సాంకేతిక విభాగం కష్టం ఇందులో కనిపించింది.
 
పనిలోపనిగా కథానుగుణంగా కాశ్మీర్‌లో కొందరు అనాధలను ఎత్తుకువచ్చి ఏవిధంగా బానిసలుగా పనిచేయించుకుంటారనే పాయింట్‌‌ను కూడా చాలా సున్నితంగా దర్శకుడు టచ్‌ చేశాడు. ఈవిషయంలో ఆయన్ను అభినందించాలి. ఇలా ఒకవైపు ప్రేమకథ, మరోవైపు కుటుంబ ఆచారాలు, నమ్మకాలు, ఇంకోవైపు బోర్డర్‌లో జరిగే ఇష్యూలను కలిపి తీసిన ఈసినిమాలో మనిషి సాటి మనిషిని గౌరవించడం నేర్చుకోవాలి. అది ప్రేమ వల్లే వస్తుంది. అనే అంతర్లీన సందేశాన్ని ఇచ్చాడు. ఇటువంటి సినిమా కుటుంబపరంగా అందరూ చూడతగ్గ సినిమా.
 
రేటింగ్‌: 3.25/5