బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 సెప్టెంబరు 2021 (11:34 IST)

'రిపబ్లిక్' ట్రైలర్ రిలీజ్ : సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం ఎలావుందంటే..

మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం 'రిపబ్లిక్'. దేవకట్టా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను బుధవారం రిలీజ్ చేశారు. ఓ పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ విశాఖ వాణిగా రమ్యకృష్ణ నటించింది. జగపతి బాబు మరో ప్రధాన పాత్ర పోషించారు. ఐశ్వర్యా రాజేష్ కథానాయికగా నటించారు.
 
ఈ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. సాయి ధరమ్ తేజ్, రమ్య కృష్ణ పోషించిన పాత్రల మధ్య రాజయుద్ధాన్ని తలపిస్తుంది. యువ ఐఏఎస్ అధికారిగా సాయి ధరమ్ తేజ్, మరోవైపు రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన మహిళ మధ్య న్యాయం కోసం జరిగే పోరాటం ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. 
 
ట్రైలర్ మొదట్లో 'సమాజంలో తిరిగే అర్హతే లేని గుండాలు పట్టపగలే బాహాటంగా అమాయకుల ప్రాణాలు తీస్తుంటే… కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థే వాళ్ళకు కొమ్ము కాస్తోంది' అంటూ చెప్పే డైలాగ్ మొదలు అన్ని డైలాగులు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటున్నాయి. ప్రజాస్వామ్య శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ… ఈ మూడు అంశాలను ప్రధానంగా చేసుకుని తెరకెక్కించారు. 
 
ఇదిలావుంటే, కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయిధరమ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి.. సాయి తేజ్ ఆరోగ్యంకు సంబంధించిన అప్డేట్ ఇస్తూ రిపబ్లిక్ ట్రైలర్ విడుదల చేశారు.
 
'సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1వ తారీఖున విడుదల చేస్తే బాగుంటుందన్న తన కోరిక మేరకు అదే తేదీన చిత్రం విడుదల అవుతుంది. మీ ఆదరణ, అభిమానం, ప్రేమే సాయి ధరమ్ తేజ్‌కి శ్రీరామ రక్ష' అంటూ రిపబ్లిక్ ట్రైలర్‌ని తన ట్విట్టర్‌లో విడుదల చేశారు.