శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By selvi
Last Updated : సోమవారం, 1 అక్టోబరు 2018 (13:19 IST)

4 నెలల బిడ్డతో పరీక్ష.. గుక్కపెట్టి ఏడ్చేసరికి హెడ్ కానిస్టేబుల్ ఏం చేశాడంటే?

పోలీసులు అంటే రఫ్ అండ్ టఫ్‌గా వుంటారని అందరికీ తెలుసు. అయితే వారి మనసులోనూ కరుణ, దయ వుంటుందని ఈ ఘటనను చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఖాకీల కరుణ హృదయానికి అద్దం పట్టే ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంద

పోలీసులు అంటే రఫ్ అండ్ టఫ్‌గా వుంటారని అందరికీ తెలుసు. అయితే వారి మనసులోనూ కరుణ, దయ వుంటుందని ఈ ఘటనను చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఖాకీల కరుణ హృదయానికి అద్దం పట్టే ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఆదివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌ కానిస్టేబుల్‌ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్ష రాసేందుకు మహబూబ్‌‍నగర్‌లో ఓ మహిళ తన నాలుగు నెలల చిన్నారితో కలిసి పరీక్షా కేంద్రానికి వచ్చింది. అయితే పరీక్ష హాల్‌లోకి అభ్యర్థిని తప్ప ఎవరిని అనుమతించరు. దాంతో పరీక్ష రాసి వచ్చేంతవరకూ తన చిన్నారిని చూసుకోవడం కోసం తన బంధువుల అమ్మాయిని వెంట తీసుకొచ్చుకుంది. 
 
పరీక్ష ప్రారంభం అయ్యే సమయానికి ఆ మహిళ తన చిన్నారిని బంధువుల అమ్మాయి దగ్గర వదిలిపెట్టి వెళ్లింది. కానీ తల్లి అలా వెళ్లిన క్షణం నుంచి ఆ పాప గుక్కపెట్టి ఏడవడం ప్రారంభించింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పాప ఏడుపు ఆపడం లేదు. ఈ సమయంలోనే పరీక్ష కేంద్ర వద్ద విధులు నిర్వహిస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ ముజీబ్‌ ఉర్‌ రెహ్మన్‌ ఆ పాపను తన చేతుల్లోకి తీసుకుని రకరకాలుగా లాలిస్తూ ఆ పాప ఏడుపును ఆపాడు. 
 
తాను పోలీస్‌ ఉద్యోగిననే గర్వం ఏమాత్రం లేకుండా చిన్నారిని ఆడిస్తున్న ముజీబ్‌ ''ఫ్రెం పోలీసింగ్‌"కు అసలైన ఉదాహరణగా నిలిచాడని ఓ ఐపీఎస్ ఆఫీసర్ ఫోటోతో పాటు ట్వీట్ చేశారు. చిన్నారిని ఆడిస్తున్న ముజీబ్‌ ఫోటోను రమా రాజేశ్వరి అనే ఐపీఎస్‌ అధికారి తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. దాంతో పాటు #Human Face Of Cops అనే హాష్‌ ట్యాగ్‌ను జత చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.