బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఎంజీ
Last Updated : ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (18:05 IST)

ఫుట్‌పాత్‌పై జీవిస్తున్న మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య మరదలు

పశ్చిమ బెంగాల్‌కు పదేళ్లకుపైగా ముఖ్యమంత్రిగా పనిచేసిన బుద్ధదేవ్ భట్టాచార్య మరదలు అత్యంత దైన్య స్థితిలో ఫుట్‌పాత్‌పై కనిపించడం అందరినీ షాక్‌కు గురిచేసింది. నెరిసిన జుట్టు, నైట్‌గౌన్‌తో ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బారాబజార్ ప్రాంతంలో తిరుగుతూ, ఫుట్‌పాత్‌పై నిద్రిస్తూ, వీధి వ్యాపారులు పెట్టే ఆహారం తింటూ గడుపుతున్న ఆమె మాజీ ముఖ్యమంత్రి మరదలని తెలిసి అందరూ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. 
 
ఆమె పేరు ఇరా బసు. వైరాలజీలో పీహెచ్‌డీ చేశారు. ఇంగ్లిష్, బెంగాలీ అద్భుతంగా మాట్లాడగలరు. అంతేకాదు, రాష్ట్రస్థాయి క్రీడాకారిణి కూడా. టేబుల్ టెన్నిస్, క్రికెట్‌లో మంచి ప్రావీణ్యం ఉంది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ప్రియానాథ్ బాలికల పాఠశాలలో లైఫ్ సైన్సెస్ టీచర్‌గానూ పనిచేశారు. భట్టాచార్య భార్య మీరా సోదరే ఇరా. రెండేళ్లుగా ఆమె ఫుట్‌పాత్‌పైనే నివసిస్తున్నారు. 
 
1976లో ఆమె ప్రియానాథ్ బాలికల పాఠశాలలో చేరారు. 28 జూన్ 2009లో ఇరా బసు రిటైర్ అయ్యారు. అప్పటికి బుద్ధదేవ్ భట్టాచార్య ఇంకా ముఖ్యమంత్రిగానే ఉన్నారు. అప్పట్లో ఆమె బారానగర్‌లో ఉండేవారు. ఆ తర్వాత ఖర్దాలోని లిచు బగాన్ ప్రాంతానికి మారారు. అయితే, ఆ తర్వాత ఒక్కసారి అక్కడి నుంచి అదృశ్యమయ్యారు. అప్పటి నుంచి ఆమె కోల్‌కతాకు సమీపంలోని డన్‌లప్ రోడ్లపైనే కనిపిస్తున్నారు.  
 
ఇరా బసు పనిచేసిన ప్రియానాథ్ స్కూల్ ప్రధానోపాధ్యాయిని కృష్ణకాళి తాజాగా మాట్లాడుతూ.. ఇరా బసు ఇక్కడే పాఠాలు బోధించేవారని, రిటైర్‌మెంట్ తర్వాత ఆమెకు రావాల్సిన పెన్షన్‌కు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలని కోరినా స్పందించలేదన్నారు. దీంతో ఆమె పెన్షన్ పొందలేకపోతున్నారని తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవమైన ఈ నెల 5న డన్‌లప్ ఆర్గనైజేషన్ అయిన ఆర్టియజోన్ సభ్యులు ఆమెను పూలమాలతో సత్కరించి స్వీట్లు తినిపించారు.
 
ఆ సందర్భంగా ఇరాబసు మాట్లాడుతూ.. టీచర్లందరూ తనను ఇంకా ఇష్టపడుతున్నారని, చాలామంది విద్యార్థులకు తానింకా గుర్తున్నానని పేర్కొన్నారు. వారిలో కొందరు తనను హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారని అన్నారు. ఇరా బసుకు ఇతర స్కూళ్ల నుంచి అవకాశాలు వచ్చినా ఆమె ప్రియానాథ్ బాలికల పాఠశాలను వదిలి వెళ్లలేదు. అక్కడే ఏకంగా 34 సంవత్సరాలపాటు పనిచేశారు. 
 
బుద్ధదేవ్ భట్టాచార్య కుటుంబంతో ఉన్న బంధుత్వంపై ఇరా బసు మాట్లాడుతూ.. ఉపాధ్యాయినిగా తన కెరియర్‌ను ప్రారంభించిన సమయంలో బుద్ధదేవ్‌తో ఉన్న బంధుత్వాన్ని ఉపయోగించుకోవాలనుకోలేదని చెప్పారు. తన శక్తియుక్తులనే ఉపయోగించానని చెప్పుకొచ్చారు. తమ కుటుంబాల మధ్య బంధుత్వం అందరికీ తెలిసిందే అయినా తాను వీఐపీ ఐడెంటిటీని కోరుకోలేదని అన్నారు. 
 
ఇరా బసు ఫుట్‌పాత్‌పై నివసిస్తున్నారన్న విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన తర్వాత అధికారులు వెంటనే స్పందించారు. అంబులెన్స్‌లో ఆమెను కోల్‌కతా ఆసుపత్రికి తరలించారు. వయసు, ఇతర సమస్యలున్నప్పటికీ విద్యావిధానంపై ఆమెకు ఇప్పటికీ మంచి పట్టు ఉండడం గమనార్హం. ఆన్‌లైన్ చదువులకు తాను మద్దతు పలకబోనని ఇరా బసు స్పష్టం చేశారు. దీనివల్ల విద్యార్థులు సమస్యలు ఎదుర్కోవడమే కాక, ఏమీ నేర్చుకోలేరని ఇరా బసు తేల్చి చెప్పారు.