శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 28 ఆగస్టు 2021 (12:39 IST)

మంత్రులు, ముఖ్యమంత్రులు ఆ కార్లనే వాడండి : కేంద్రం సూచన

ప్రభుత్వ బాధ్యులుగా నిత్యం వివిధ పర్యటనల్లో ఉండే చీఫ్‌ మినిష్టర్లు, మినిస్టర్లకు కేంద్రం కీలక సూచన చేసింది. ప్రభుత్వ విధానాలకు తగ్గట్టుగా మంత్రులు, ముఖ్యమంత్రులు ఎల‌క్ట్రిక్ వాహనాలనే ఉపయోగించాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్‌, సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ లేఖ రాశారు.

కేంద్ర ప్రభుత‍్వం గత కొంత కాలంగా ఎల‌క్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని కోరుతోంది. అందుకు తగ్గట్టే ఎల‌క్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెంచేందుకు ఫేమ్‌ పేరుతో ప్రత్యేకంగా ప్రోత్సహకాలు అందిస్తోంది.

ప్రజలకు ఆదర్శనంగా నిలవాల్సిన ప్రజా ప్రతినిధులు కూడా ఎల‌క్ట్రిక్ వాహనాలు(ఈవీ)లను ఉపయోగిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కేంద్ర మంత్రి ఆర్కే సింగ్‌ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రతినిధులకు లేఖ రాశారు.

ప్రస్తుతం మీరు ఉపయోగిస్తున్న డీజిల్‌, పెట్రోల్‌ ఇంజన్‌ వాహనాలకు బదులుగా ఎల‌క్ట్రిక్ వాహనాల(ఈవీ)లను ఉపయోగించాలని మినిస్టర్స్‌, చీఫ్‌ మినిస్టర్స్‌కి రాసిన లేఖలో కేంద్ర మంత్రి కోరారు.

అంతేకాదు ఆయా శాఖల వారీగా ఉపయోగిస్తున్న పెట్రోలు, డీజిల్‌ వాహనాలను సైతం ఈవీలగా మార్చాలని కోరారు. దాదాపుగా అన్ని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ఈవీలనే వాడాలని సూచించింది.