శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 ఆగస్టు 2021 (19:56 IST)

కర్ణాటక కేబినెట్ విస్తరణ: 29మంది కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం

కర్ణాటక కేబినెట్ విస్తరణకు వేళైంది. కర్ణాటక కొత్త సీఎం బసవరాజ్‌ బొమ్మై తన కేబినెట్‌ను బుధవారం విస్తరించారు. గవర్నర్‌ తావార్‌చంద్ గెహ్లాట్ రాజ్ భవన్‌లో 29 మంది కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. 
 
అయితే ఈసారి డిప్యూటీ సీఎం పదవిని ఎవరికీ కేటాయించలేదు. అలాగే మాజీ సీఎం యెడియూరప్ప కుమారుడు విజయేంద్రను కూడా మంత్రివర్గంలోకి తీసుకోలేదు. కీలకమైన మైసూర్, గుల్బర్గా, కొడగు, బళ్లారి, హసన్, రామనగర, దావంగెరె, యాదగిరి, రాయచూర్, విజయపుర, చామరాజనగర్, కోలార్, చిక్‌మగళూర్‌ జిల్లాల నుంచి ఎవరికీ మంత్రి పదవులు దక్కలేదు.  
 
మాజీ డిప్యూటీ సీఎం గోవింద్ కర్జోల్, మాజీ మంత్రులు ఈశ్వరప్ప, ఆర్‌ అశోక, బీ శ్రీరాములు ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. కొత్త కేబినెట్‌లో 7 మంది ఓబీసీలు, ముగ్గురు ఎస్సీలు, ఒక ఎస్టీ, ఏడుగురు వొక్కలిగలు, 8 మంది లింగాయత్‌లు, రెడ్డి వర్గానికి చెందిన ఒకరితోపాటు ఒక మహిళకు మంత్రి పదవులు దక్కాయి. కాగా, తన కేబినెట్‌ను దశలవారీగా విస్తరిస్తానని సీఎం బసవరాజ్‌ బొమ్మై ఇటీవల తెలిపారు.