సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 జులై 2021 (18:50 IST)

మూగజీవాల పట్ల అమానుషం.. కోతులకు విషం పెట్టి.. గోనె సంచుల్లో..? (video)

మూగజీవాల పట్ల కొందరు వ్యక్తులు అమానుషంగా ప్రవర్తించారు. వానరాలకు విషం పెట్టి.. గోనె సంచుల్లో కుక్కి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో 30 కోతులు మరణించాయి. ఈ ఘటన కేరళలోని హసన్ జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. హసన్‌ జిల్లా బెలూర్‌ తాలూకా చౌడనహళ్లి గ్రామం సమీపంలోని రోడ్డు పక్కన ఈ ఉదయం స్థానిక యువకులు కొన్ని గోనె సంచుల మూటలు గుర్తించారు. వెంటనే వాటిని తెరవగా.. అందులో కోతుల కన్పించాయి. 
 
కొన్ని సంచుల్లో ఉన్న కోతులు అప్పటికే మరణించగా.. మరికొన్ని తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్నాయి. మొత్తం 30 వానరాలు చనిపోగా.. మరో 20 గాయపడ్డాయి. గాయపడిన కోతులను బయటకు తీసి నీరు తాగించారు. ఇందులో 18 కోతులు కోలుకోగా.. మరో రెండింటిని వెటర్నరీ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
 
సమాచారమందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కోతులకు విషం పెట్టి, సంచుల్లో కుక్కారని, సంచుల పై నుంచి బలంగా కొట్టి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. 
 
ఈ ఘటన జంతు ప్రేమికులను తీవ్రంగా బాధించింది. మూగజీవాల పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తించిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.