డాక్టర్ ప్రిస్కిప్షన్ ఉంటే మద్యం.. ఎక్కడ?
దేశ వ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్ అమలవుతోంది. దీంతో అత్యవసర సేవలు మినహా అన్ని రకాల సేవలు బంద్ అయ్యాయి. దీంతో మద్యంబాబు తల్లడిల్లిపోతున్నారు. అనేక మంది మద్యం లేక చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. మద్యానికి బానిసలైన మరికొందరు మద్యం లేదన్న టెన్షన్ తట్టుకోలేక బలవన్మరణాలకు కూడా పాల్పడుతున్నారు. దీంతో ఆత్మహత్యలకు పాల్పడే తాగుబోతుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ పరిస్థితి కేరళ, తెలంగాణా రాష్ట్రాల్లో అధికంగా ఉంది.
ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వానికి ఓ మంచి ఐడియా వచ్చింది. డాక్టర్ ప్రిస్కిప్షన్ చూపిస్తే మద్యం విక్రయించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదేశించారు. ఎక్సైజ్ శాఖ తప్పకుండా ఆ నియమావళి పాటించాలని కోరారు.
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని మద్యం షాపులను మూసివేశారు. లాక్‌డౌన్ విధించడంతో ఎవరూ ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. ఇక రోజూ మద్యం సేవించే వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. మద్యం దొరక్కపోవడంతో ఆత్మహత్యలు పెరుగుతున్నట్లు ప్రభుత్వానికి నివేదిక అందింది. అయితే ఆ సమస్యను అధికమించేందుకు చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖకు సీఎం ఆదేశాలు ఇచ్చారు.
డాక్టర్లు సూచించిన వారికి మద్యాన్ని అమ్మాలంటూ సీఎం విజయన్ సోమవారం ఆదేశాలు ఇచ్చారు. సూసైడ్ లక్షణాలు ఉన్నవారికి వెంటనే చికిత్స అందిచాలన్నారు. డీ-అడిక్షన్ సెంటర్లకు వారిని తరలించాలని ఆయన ఎక్సైజ్ శాఖను ఆదేశించారు. ఒకేసారి మద్యం అందుబాటులో లేకపోవడం వల్ల.. సామాజికంగా కూడా సమస్యలు ఉత్పన్నం అవుతాయని సీఎం విజయన్ అంగీకరించారు.