సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 మార్చి 2020 (18:23 IST)

ఉద్యోగులకు అభయహస్తం ఇచ్చిన ఆస్ట్రేలియా ప్రభుత్వం

ప్రపంచం కరోనా వైరస్ భయంతో వణికిపోతోంది. ఈ వైరస్ బారినపడి అనేక మంది మృత్యువాతపడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియాలో చేస్తున్న ఉద్యోగులందరికీ ఈ నిర్ణయం ఎంతో ఉపశమనం కలిగించనుంది. 
 
నిజానికి కరోనా వైరస్ దెబ్బకు అనేక కంపెనీలు ఉద్యోగులను వదిలించుకునే పనిలో ఉన్నాయి. కానీ, ఆస్ట్రేలియాలో మాత్రం ఉద్యోగులంతా ప్రస్తుతం చేస్తున్న పనుల్లోనే కొనసాగేలా చర్యలు తీసుకోనుంది. 
 
అందులో భాగంగా ఉద్యోగులందరికీ ప్రతి రెండు వారాలకు 1500 డాలర్ల వేతన సబ్సిడీ ఇస్తామని, అంత మొత్తం ఉద్యోగికి సంస్థ ఇచ్చే వేతనం నుంచి మినహాయించుంటాయని వెల్లడించారు. ప్రజలు తమకు అత్యవసరమైతేనే ఇండ్లనుంచి బయటకు రావాలని సూచించారు. 
 
ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ సోమవారం భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. వ్యాపారాలు, ఉద్యోగులకు చేయూతనిచ్చేందుకు 130 బిలియన్‌ ఆస్ట్రేలిలియన్‌ డాలర్లను కేటాయించినట్లు తెలిపారు.