శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 మార్చి 2020 (16:50 IST)

తూగోలో కలవరం... రెండు పాజిటివ్ కేసులు.. ఏపీలో కేసులు 23

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కూడా తూర్పు గోదావరి జిల్లాలో నమోదు కావడం గమనార్హం. ఈ రెండు పాజిటివ్ కేసుల్లో ఒకటి కాకినాడ, రెండోది రాజమండ్రిలో నమోదైనట్టుగా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. 
 
జిల్లా వ్యాప్తంగా జరిపిన ఇంటింటి సర్వేలో భాగంగా, కాకినాడలో 49 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ రాగా, రాజమండ్రిలో 72 ఏళ్ల వృద్ధుడు కరోనా బారినపడినట్టు తేలింది. ఈ రెండు కేసులతో కలిపి ఏపీలో కరోనా పాజిటివ్ వ్యక్తుల సంఖ్య 23కి పెరిగింది.
 
రాష్ట్రంలో ఇప్పటిదాకా 649 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. త్వరలో మరికొందరికి పరీక్షలు నిర్వహించనున్నారు. విదేశాల నుంచి రాష్ట్రానికి 29,672 మంది రాగా, వారిలో 29,494 మంది వారి ఇళ్లలోనే స్వీయ నిర్బంధంలో ఉన్నారు.
 
అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. అంతేకాకుండా నిత్యావసర సరకులను కూడా ప్రభుత్వమే ప్రతి ఇంటింటికీ గ్రామ వలంటీర్ల ద్వారా అందించే ఏర్పాట్లు చేస్తోంది.