సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : గురువారం, 1 నవంబరు 2018 (11:29 IST)

సీమాంధ్రలో పోటీ చేయనంటున్న 'ఆంధ్రా ఆక్టోపస్'

ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుగడించిన వ్యక్తి లగడపాటి రాజగోపాల్. ఈ మాజీ లోక్‌సభ సభ్యుడు రాష్ట్ర విభజన అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే, ఈ మధ్యకాలంలో అడపాదడపా మీడియా ముందుకు వస్తూ పలు అంశాలపై స్పందిస్తున్నారు. ముఖ్యంగా.. ఎన్నికల ఫలితాలపై ఆయన వెల్లడిస్తున్న విషయాలు అక్షరసత్యాలవుతున్నాయి. దీంతో లగడపాటి సర్వేను ప్రతి ఒక్కరూ గట్టిగా నమ్ముతారు. 
 
ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీలో ఏపీ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ, 'ప్రజల కోరిక మేరకు రాజకీయాల్లోకి రావడంపై నిర్ణయం తీసుకుంటా. ఈ మధ్య తెలంగాణలోని మెదక్‌ జిల్లాకు వెళ్తే అక్కడి ప్రజలు, పోలీసులు చుట్టుముట్టి తెలంగాణలో పోటీ చేయకూడదా అని అడిగారు. అవకాశమొస్తే తెలంగాణలో తప్పకుండా పోటీ చేస్తా. ఆంధ్రాలో భావోద్వేగాలను అడ్డుపెట్టుకొని రాజకీయంగా ఎదగకూడదని అనుకున్నా కాబట్టి తెలంగాణలో చాన్స్‌ వస్తే పోటీ చేస్తానని చెప్పా. పార్లమెంటుకే తప్ప అసెంబ్లీకి పోటీ చేసే ఆలోచన లేదు. అది కూడా ఇప్పుడు కాదు. ఇదే విషయాన్ని అక్కడి ప్రజలకు చెప్పా' అని ఆయన వివరించారు. 
 
'రాజకీయాల్లో పరిస్థితులను బట్టి అనేకమంది కలుస్తారు. ప్రస్తుతం ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు ప్రత్యర్థులు కావు. అందుకు కలిశాయేమో' తెలంగాణా రాష్ట్రంలో టీడీపీ - కాంగ్రెస్ పార్టీల పొత్తుపై స్పందించారు. మహాకూటమి గెలుస్తుందా అన్న ప్రశ్నకు.. అది తెలంగాణ ప్రజలే చెప్పాలన్నారు. తన సమాధానం డిసెంబరు 7వ తేదీన వెల్లడిస్తానని తెలిపారు.