ఆకాశంలో వివాహం.. బంధువులకు.. వధూవరులకు మాస్కుల్లేవ్.. అసలేం జరుగుతోంది..?
కరోనా, లాక్డౌన్ కారణంగా పెళ్లిళ్లు నిరాడంబరంగా జరుగుతున్నాయి. అతికొద్దిమంది సమక్షంలో వివాహాలు జరుగుతున్నాయి. కరోనాను నియంత్రించేందుకు వివాహాలు లైవ్ స్ట్రీమింగ్‌లో జరిగిపోతున్నాయి. అయితే లాక్ డౌన్ సమయంలో ఓ జంటకు కొత్త ఆలోచన పుట్టింది. ఈ లాక్డౌన్‌లో ఆ జంట ఏకంగా విమానంలో పెళ్లి చేసుకుంది. విమానాన్ని అద్దెకు తీసుకుని విమానంలోనే పెళ్లి చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మధురైకి చెందిన రాకేష్-దక్షిణ జంట మధురై- బెంగళూరుకు విమానాన్ని బుక్ చేసుకుంది. అందులో కుటుంబ సభ్యులందరికీ టికెట్లను బుక్ చేశారు. అలా 161సీట్లు బంధువులతో నిండిపోయాయి. ఆపై ఆకాశంలో ఎగిరిన విమానంలో ఈ వివాహం జరిగింది. . ఆకాశంలో ఉండగా మంత్రోచ్చారణల మధ్య పెళ్లి కొడుకు పెళ్లి కూతురి మెడలో తాళి బొట్టు కట్టాడు. మధురై మీనాక్షి అమ్మవారి గుడి చుట్టూ విమానం చక్కర్లు కొట్టింది. అలా విమానంలో పెళ్లి తంతు ముగిశాక ఈ పెళ్లి బృందం బెంగళూరు నుంచి మధురైకి తిరిగి చేరుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. ఈ వివాహంలో కరోనా మార్గదర్శకాలు అమలు ఎక్కడా కనిపించలేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. విమానంలో అతిథులు క్రిక్కిరిసి ఉండగా, వధూవరులకు మాస్కుల్లేకుండానే కనిపించడాన్ని డీజీసీఏ తప్పుబట్టింది. కరోనా నిబంధనలు పాటించకుండా ఇలాంటి కార్యక్రమాలు ఏంటని విచారణకు ఆదేశించింది.
పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలంటూ స్పైస్ జెట్, ఎయిర్ పోర్ట్ వర్గాలను ఆదేశించింది. ఆ విమానంలోని స్పైస్ జెట్ సిబ్బందిని విధుల నుంచి తప్పించారు. నిబంధనలు పాటించకుండా విమానం ఎక్కిన పెళ్లి బృందంపై ఫిర్యాదు చేయాలంటూ స్పైస్ జెట్‌ను డీజీసీఏ ఆదేశించింది.