రహస్యంగా సరిహద్దులకు ప్రధాని నరేంద్ర మోడీ.. వెంట బిపిన్ రావత్ (video)
దేశ ప్రధాని నరేంద్ర మోడీ రహస్యంగా సరిహద్దులకు వెళ్లారు. ఆయన వెంట త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ ఉన్నారు. తూర్పు లడఖ్‌లోని సరిహద్దులకు ఆయన వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ షెడ్యూల్‌లోని ఈ పర్యటనకు ముందుగానే రహస్యంగా ఏర్పాట్లు జరిగినట్లు తెలుస్తోంది. ఆయన వెంట త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ కూడా ఉన్నారు.
వీరు ఇరువురూ సరిహద్దుల్లో వీరోచితంగా పోరాడుతూ దేశాన్ని కాపాడుతున్న సైనికుల్లో మనోస్థైర్యాన్ని నింపేందుకు లడఖ్‌లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం ఉదయం లడఖ్‌కు మోడీ వచ్చారని అక్కడి మీడియా వెల్లడించేంత వరకూ విషయం బయటకు రాకపోవడం గమనార్హం.
మోడీ వెంట సైన్యాధిపతి కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన లేహ్, నిములలో పర్యటిస్తున్నారు. మోడీ పర్యటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడే సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయి. భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో అకస్మాత్తుగా మోడీ ఈ పర్యటన జరపడం గమనార్హం.
ఈ వీడియోల్లో మోడీ కూడా సైనిక దుస్తుల్లో కనిపిస్తున్నారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సైనికులకు సెల్యూట్ చేసి, వారి భుజాలు తడుతూ అభినందించారు. కరోనా భయాలను పక్కనబెట్టి, జవాన్లతో కరచాలనం చేశారు. ఈ సందర్భంగా జవాన్లంతా జై హింద్ అని నినాదాలు చేస్తుంటే, మోడీ కూడా వారితో కలిసి భరతమాతకు జైకొట్టారు.
వాస్తవానికి శుక్రవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లడఖ్ వెళతారని రెండు రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. అయితే, రాజ్‌నాథ్ స్థానంలో ప్రధానే స్వయంగా వెళ్లి, సైనికుల్లో ధైర్యాన్ని నింపాలని నిర్ణయించుకున్న మీదటే, ఆయన పర్యటనకు ఏర్పాట్లు జరిగాయని తెలుస్తోంది. భారత్ శాంతికాముక దేశమని, ఇదే సమయంలో ఎవరైనా దురాక్రమణకు దిగితే మాత్రం ఏ మాత్రమూ జాలి, దయ వద్దని మోడీ ఈ సందర్భంగా సరిహద్దు జవాన్లకు సూచించినట్టు సమాచారం.