సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 మే 2020 (17:32 IST)

ఎన్టీఆర్ ఘాట్‌కు రావట్లేదు.. మీరూ రావొద్దు.. ఫ్యాన్స్‌కు తారక్ విజ్ఞప్తి

ఆంధ్రుల ఆరాధ్యదైవం, మహానటుడు, దివంగత స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు మే 28వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగనున్నాయి. అయితే, ఈ జయంతిని పురస్కరించుకుని ప్రతి యేడాది తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అయితే, కరోనా మహమ్మారి కారణంగా ఈ యేడాది ఈ కార్యక్రమాన్ని కేవలం డిజిటల్ మహానాడుగా నిర్వహిస్తోంది. 
 
అలాగే, ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఆయన సమాధి అయిన ఎన్టీఆర్ ఘాట్ వద్దకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా వెళ్లి నివాళులు అర్పిస్తుంటారు. కానీ, ఈ యేడాది అక్కడకు వెళ్లరాదని నిర్ణయించారు. 
 
అయితే గురువారం ఎన్టీఆర్ ఘాట్‌ను జూనియర్ ఎన్టీఆర్, ఆయన సోదరుడు కల్యాణ్ రామ్ సందర్శించడం లేదు. ఇంటి వద్ద నుంచే తమ తాతగారికి వారు నివాళి అర్పించనున్నారు. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలు అమల్లో ఉన్న నేపథ్యంలో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
తాము ఘాట్ వద్దకు వస్తే అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడ గుమికూడే అవకాశం ఉన్న నేపథ్యంలో, వారు రేపు ఘాట్ కు రాకూడదని నిర్ణయించుకున్నారు. అందువల్ల ఏ ఒక్క అభిమాని కూడా ఎన్టీఆర్ ఘాట్‌కు రావొద్దని తారక్, కళ్యాణ్ రామ్‌లు విజ్ఞప్తి చేశారు.