Bapatla, ఇంట్లో అమ్మానాన్నలు ఏమవుతారోనన్న స్పృహ వుంటే ఇలా బైక్ నడుపుతారా, గుద్దేశారు (video)
రోడ్డు ప్రమాదాలు. కొన్ని అకస్మాత్తుగా జరుగుతుంటాయి. వాటిని ఎవ్వరూ అడ్డుకోలేరు. ఐతే చాలా ప్రమాదాల్లో ప్రమాదానికి కారణం సదరు వాహనాలను బాధ్యతారాహిత్యంగా నడిపేవారి వల్లనే జరుగుతోంది. దీనివల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. కుటుంబాలకు తీరని దుఃఖం మిగిలిస్తున్నారు. ఇంట్లో అమ్మానాన్నలు, కుటుంబ సభ్యులు ఏమవుతారోనన్న స్పృహ వుంటే అలా వాహనాలను నడుపలేరు. పూర్తిగా బాద్యతారాహిత్యం వల్ల ఎందరో ప్రమాదాల్లో ప్రాణాలను కోల్పోతున్నారు. ఇలాంటి విషాదకర ఘటన బాపట్ల క్లాక్ టవర్ సెంటర్ వద్ద జరిగింది.
సీసీ కెమేరాలో రికార్డయినదాన్ని బట్టి చూస్తే, ద్విచక్ర వాహనం నడుపుతున్న యువకుడు రాకెట్ కంటే వేగంగా నడుపుతూ వచ్చి గుంటూరు వైపు వెళ్తున్న లారీ వెనుక చక్రాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో యువకులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. వీరి వెనుకే మరో రెండు బైకుల్లో నలుగురు వచ్చారు. చూస్తుంటే వారంతా ఏదో బైక్ రేస్ పోటీ పెట్టుకుని వేగంగా వచ్చినట్లు కనబడుతోంది. ఆ రోడ్డులో కూడలి వుందన్న స్పృహ కూడా లేకుండా అంత వేగంతో వచ్చేసారు.
ఇంతకుముందు ఈ కూడలి వద్ద రాళ్లతో బారికేడ్లు వుండేవి. వాటిని ఎవరు తొలగించారో తెలియదు కానీ... అవి వున్నట్లయితే కనీసం ఇలాంటివారి వేగానికి కాస్తయినా అడ్డుకట్ట పడుతుంది. ఏదేమైనప్పటికీ ఇలా బైక్ రేసులతో చెలరేగేవారికి భారీ జరిమానాలు వేస్తేనే కనీసం అలాంటి వారి కుటుంబాలకు క్షోభ లేకుండా చేసినవారవుతారు. పోలీసు శాఖ ఇలాంటి వారిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా వుంది.