బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 జులై 2020 (18:04 IST)

చివరి దశకు చేరుకున్న కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు

ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ఆస్ట్రాజెనెకా ఫార్మా సంస్థతో కలిసి కరోనా వ్యాక్సిన్ తయారీ కోసం చేస్తున్న కృషి ఫలిస్తోంది. ఈ వ్యాక్సిన్ తయారీ ప్రస్తుతం ఆఖరి అంకంలోకి ప్రవేశించింది. 
 
ఆక్స్‌ఫర్డ్ పరిశోధకులు ChAdOx1 nCoV-19 పేరిట రూపొందిస్తున్న వ్యాక్సిన్ చింపాంజీలపై సత్ఫలితాలను ఇచ్చింది. దాంతో ఇప్పుడు మానవులపై ప్రయోగాలు చేస్తున్నారు. బ్రెజిల్‌లోని కొందరు వాలంటీర్లకు ఈ వ్యాక్సిన్ ఇచ్చి పరిశీలిస్తున్నారు. 
 
కరోనా నుంచి ఈ వ్యాక్సిన్ మానవులకు ఎంతవరకు రక్షణ ఇస్తుందో ఈ ఆఖరి దశ ప్రయోగాల ద్వారా గుర్తించనున్నారు. ఇప్పటికే దక్షిణాఫ్రికాలో 2 వేల మందికి ChAdOx1 nCoV-19 వ్యాక్సిన్ ఇచ్చారు. 
 
బ్రిటన్‌లోనూ 4 వేల మంది వలంటీర్లు ప్రయోగాలకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రయోగాలు ఖచ్చితంగా విజయవంతం అవుతాయన్న అంచనాల నేపథ్యంలో ఆస్ట్రాజెనెకా సంస్థ అక్టోబరు నాటికి వ్యాక్సిన్‌ను తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 3 కోట్ల డోసులను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది. 
 
మరోవైపు, అనేక సంస్థలు కరోనా వ్యాక్సిన్ విషయంలో పురోగతి సాధించి, మనుషులపై ప్రయోగాలకు తెరలేపాయి. వీటిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా, చైనాకు చెందిన సినోవాక్ బయోటెక్ గురించే. 
 
ఆస్ట్రాజెనెకాతో జట్టుకట్టిన ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ సీహెచ్ఏడీఓఎక్స్1 ఎన్ కోవ్-19 పేరిట వ్యాక్సిన్‌ను తీసుకువస్తోంది. ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ ఆరంభించింది. అటు సినోవాక్ బయోటెక్ కరోనావాక్ పేరుతో వ్యాక్సిన్‌కు రంగం సిద్ధం చేస్తోంది.
 
అయితే, కీలకమైన క్లినికల్ ట్రయల్స్‌కు ఈ సంస్థలు బ్రెజిల్ దేశాన్నే ఎంచుకున్నాయి. ఎందుకంటే బ్రెజిల్‌లో ప్రస్తుతం కరోనా మహమ్మారి సామాజిక సంక్రమణం దశలో కొనసాగుతూ పతాక స్థాయిలో విజృంభిస్తోంది. దీంతో ఈ ప్రదేశానికి గణనీయమైన వైద్యపరమైన అనుభవం చేకూరింది. 
 
ఈ అనుభవం వ్యాక్సిన్ పరిశోధన సంబంధిత అంశాలకు ఎంతగానో తోడవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మానవులపై ప్రయోగాలు చేస్తే కచ్చితమైన ఫలితాలు వస్తాయన్నది పరిశోధన సంస్థల భావన. ప్రపంచ ప్రజలకు అత్యంత త్వరగా కరోనా వ్యాక్సిన్ అందించాలంటే బ్రెజిల్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అనుకూలమని బ్రెజిల్‌లోని బుటాంటన్ ఇన్ స్టిట్యూట్ క్లినికల్ రీసెర్చ్ మెడికల్ డైరెక్టర్ రికార్డో పలాసియోస్ వివరించారు.
 
ప్రస్తుతం బ్రెజిల్‌లో 16 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 65,556 మంది మృత్యువాత పడ్డారు. నిత్యం వేలల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తమ వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు ఇదే అనువైన దేశంగా భావించిన ఆక్స్‌ఫర్డ్ - ఆస్ట్రాజెనెకా అక్కడి ఫెడెరల్ యూనివర్సిటీ ఆఫ్ సావోపాలోతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనికి లేమాన్ ఫౌండేషన్ నిధులు సమకూర్చుతోంది.
 
అటు, చైనాకు చెందిన సినోవాక్ బయోటెక్ స్థానికంగా పరిశోధన రంగంలో కాకలుతీరిన బుటాంటన్ ఇన్ స్టిట్యూట్ తో చేయికలిపింది. దాంతో ఈ దక్షిణ అమెరికా దేశం కరోనా వ్యాక్సిన్ పోటీకి కదనక్షేత్రంగా మారింది. ఏ పరిశోధన సంస్థ విజయం సాధించినా అది ప్రపంచ మానవాళికి శుభపరిణామమే అవుతుంది.