ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 26 జూన్ 2020 (15:35 IST)

కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంత వరకు అప్రమత్తంగా ఉండాలి : ప్రధాని మోడీ

దేశంతో పాటు.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ వచ్చేంత వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 
 
వాక్సిన్ వచ్చేంత వరకూ భౌతిక దూరంతో పాటు మాస్కులను కూడా తప్పకుండా ధరించాలని ఆయన సూచించారు. వలస కూలీల నిమిత్తమై రూపొందించిన 'ఆత్మ నిర్భర్ ఉత్తర ప్రదేశ్ రోజ్‌గార్ అభియాన్' పథకాన్ని శుక్రవారం ప్రారంభించారు.
 
ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగిస్తూ, 'మనందరి జీవితాల్లో ఎత్తు పల్లాలుంటాయి. మన మన సామాజిక జీవితాల్లో కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటాం. ప్రపంచమంతా ఒకేసమయంలో ఒకే సమస్యను ఎదుర్కొంటుందని ఎవరూ ఊహించలేదు. 
 
ఈ వ్యాధి నుంచి ఎప్పుడు బయటపడతామో తెలియదు. వాక్సిన్ వచ్చేంత వరకూ రెండు గజాల దూరం పాటించాలి. మాస్కులను తప్పకుండా ధరించాలి. కరోనా సోకకుండా చూసుకోవాలి' అని సూచించారు. 
 
అంతేకాకుండా, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటోందన్నారు. దీనికి నిదర్శనమే నాలుగు యూరోపియన్ యూనియన్ దేశాల్లో మరణాల సంఖ్య 1.30 లక్షలు ఉంటే, యూపీలో కేవలం 600 మాత్రమే ఉన్నాయని ప్రధాని మోడీ గుర్తుచేశారు.