మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 20 జూన్ 2020 (13:49 IST)

వలస కార్మికుల కోసం కొత్త పథకం : బీహార్‌లో ప్రారంభించిన ప్రధాని మోడీ

కరోనా లాక్డౌన్ సమయంలో వలస కార్మికుల కష్టాలను జాతియావత్తూ కనులారా చూసింది. ఒక్కో వలస కార్మికుడి కష్టాలు విని, చూసి ప్రతి ఒక్కరూ కన్నీరు కార్చారు. అలాంటి వరస కార్మికులను ఆదుకునేందుకు వీలుగా కేంద్రం రంగంలోకి దిగింది. 
 
ఇందులోభాగంగా, సుమారుగా రూ.50 వేల కోట్ల వ్యయంతో గరీబ్ కళ్యాణ్ రోజ్‌గార్ అభియాన్ అనే పేరుతో సరికొత్త పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను సృష్టించడమే ఈ పథకం లక్ష్యం. 
 
కరోనా కారణంగా ఉపాధిని కోల్పోయిన వారికి పని కల్పించి, వారికి అవసరమైన ఆర్థిక సహకారాన్ని అందించేందుకు దీన్ని ఏర్పాటు చేసినట్టు ఈ పథకం ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. 
 
ఈ పథకాన్ని శనివారం బీహార్ రాష్ట్రంలోని ఖగారియా జిల్లాలో ప్రధాని మోడీ ప్రారంభించారు. త్వరలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ, వ్యూహాత్మకంగా పథకం ప్రారంభానికి ఈ జిల్లాను మోడీ ఎంచుకున్నారు. శనివారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ పథకాన్ని ప్రారంభించారు. 
 
లాక్డౌన్ కారణంగా తామున్న ప్రాంతంలో పనులు లేక, అష్టకష్టాలు పడుతూ స్వస్థలాలకు బయలుదేరిన వలస కార్మికుల అవస్థలు తనను కదిలించాయని, వారి కోసమే ఈ పథకమని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. 
 
'వలస కార్మికులకు వారి ఇళ్లకు సమీపంలోనే పనులు ఇస్తాం. ఇప్పటివరకూ మీ ప్రతిభను నగరాభివృద్ధికి వినియోగించారు. ఇక మీ ప్రాంతంలో అభివృద్ధికి, మీ సమీప ప్రాంతాల అభివృద్ధికి వినియోగించండి' అని కార్మికులను ఉద్దేశించి ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. 
 
లాక్డౌన్ కారణంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రత్యేక శ్రామిక్ రైళ్ల ద్వారా స్వస్థలాకు చేరవేశామని, ఇప్పుడు అక్కడే పనులు చేసుకునేందుకు గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ యోజనను తీసుకొస్తున్నామని అన్నారు. 
 
ప్రభుత్వ కాంట్రాక్టు పనుల ద్వారా మౌలిక వసతులను అభివృద్ధి పరచాలని నిర్ణయించామని, ఇందుకు రూ.50 వేల కోట్లను ఖర్చు చేస్తామని ఈ సందర్భంగా మోడీ వెల్లడించారు. 
 
కాగా, ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 116 జిల్లాల్లోని వలస కార్మికులకు 125 రోజుల పాటు ఉపాధి కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ పాల్గొన్నారు.