శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: ఆదివారం, 14 జూన్ 2020 (19:51 IST)

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి మోదీ, సచిన్, మహేశ్ బాబు, పూజా హెగ్డే, తమన్నా తదితరుల సంతాపం

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు పాల్పడటం పట్ల బాలీవుడ్, టాలీవుడ్ సహా రాజకీయ నాయకులు, ప్రముఖ క్రీడాకారులు దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, టాలీవుడ్ హీరో మహేశ్ బాబు, నటీమణులు కీర్తి సురేశ్, తమన్నా, పూజా హెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు విచారం వ్యక్తం చేశారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని, ఆయన సినిమాలను గుర్తు చేసుకున్నారు. అలాగే క్రికెటర్ సచిన్, పలువురు ఇతర క్రీడాకారులు, కేంద్ర మంత్రులు, నాయకులు సంతాపం తెలిపారు.
 
ఈ వార్త విని షాక్‌కు గురయ్యానంటూ టాలీవుడ్ హీరో మహేశ్ బాబు ట్వీట్ చేశారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసి తనకు మాట రాలేదన్నారు.
 
యువనటుడు సుశాంత్ ఓ టాలెంట్ పవర్ హౌస్ అని, అతని మరణం పట్ల తాను తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని, అతని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
 
సుశాంత్ చురుకైన యువ నటుడని, చాలా చిన్న వయసులో చనిపోవడం బాధగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
 
బుల్లితెర, వెండితెర రెండింటిపైనా రాణించిన ఆయన ఎదుగుదల ఎందరికో స్ఫూర్తి కలిగించిందని.. ఆయన మరణం దిగ్భ్రాంతి కలిగించిందని మోదీ అన్నారు.
 
సుశాంత్ లేరన్న వార్త తనను షాక్‌కి గురిచేసిందని, అతనో అద్భుతమైన నటుడని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్ననంటూ... సచిన్ తెందుల్కర్ ట్వీట్ చేశారు.
 
సుశాంత్ మరణ వార్త విని తాను షాక్‌కు గురయ్యానని, అది నిజం కాదని అనుకుంటున్నానని ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ట్వీట్ చేశారు ఇది ఎంతో విషాదకర వార్త అని, బాలీవుడ్‌కు తీరని లోటుని, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి అని బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ అన్నారు.
 
ఈ వార్త వినగానే తాను షాక్‌కి గురయ్యానని, సుశాంత్ నటించిన చిచ్చోరే సినిమా చూసి ఎంతో ఎంజాయ్ చేశానో ఆ సినిమా నిర్మాత సాజిత్‌కు చెప్పాను. ఆ సినిమాలో నేనూ భాగమైతే బాగుండునని అనిపించింది. సుశాంత్ మంచి టాలెంట్ ఉన్న నటుడని, అతని లేని లోటు తట్టుకునేలా వారి కుటుంబానికి దేవుడు ఆత్మస్థైర్యాన్ని అందించాలని కోరుకుంటున్నానంటూ... అక్షయ్ కుమార్ అన్నారు.
 
సుశాంత్ మరణ వార్త విని తన గుండె పగిలిందని హీరోయిన్ తమన్నా భాటియా అన్నారు. యంగ్, టాలెంటెడ్ యాక్టర్ ఇంత త్వరగా దూరమయ్యాడంటూ ట్వీట్ చేశారు.
 
ఈ వార్త నేను నమ్మను... షాక్ లో ఉన్నా... మాటలు రావడం లేదు, అతని ఆత్మకు శాంతి కలగాలంటూ నటి పూజా హెగ్డే ట్వీట్ చేశారు.
 
జేమ్స్ డీన్, హీత్ లెడ్జర్ల మరణం తర్వాత నన్ను అంతగా షాక్ ‌కి గురి చేసిన ఘటన సుశాంత్ మరణవార్తేనని అన్నారు బాలీవుడ్ దర్శకుడు రాం గోపాల్ వర్మ. దేవుడు కరోనా వైరస్‌తోనే కాకుండా.. బాలీవుడ్ మీద ఇలా కూడా పగ తీర్చుకున్నాడంటూ ట్వీట్ చేశారు.
 
యువ నటుడు లేరన్న వార్త తనకు షాక్‌కి గురి చేసిందన్నారు. మాటలు రావటం లేదని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కీర్తి సురేశ్ ట్వీట్ చేశారు. నమ్మలేకపోతున్నానని, సుశాంత్ అందమైన నటుడని, ఓ మంచి స్నేహితుడిని కోల్పోయానని... ఈ వార్తతో తన గుండె బద్దలైపోతోందని బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ట్వీట్ చేశారు.
 
మాటలు రావటం లేదు, షాక్‌లోఉన్నా, చేతులు వణుకుతున్నాయి, ఈ భయంకరమైన వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. సుశాంత్ ఓ అద్భుతమైన వ్యక్తి, అతన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాం అని రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు
 
అద్భుతమైన నటుడిని కోల్పోయామని, సుశాంత్ మరణ వార్త ఆవేదనను కలిగించిందని అనసూయ ట్వీట్ చేశారు.
 
సుశాంత్ లేరన్న వార్త విని ఎంతో బాధపడ్డానని, చాలా ప్రతిభ కలిగిన యువ నటుడైన సుశాంత్, తన నటనా ఛరిష్మాతో వెండితెరపై మ్యాజిక్ చేశారంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ ట్వీట్ చేశారు
 
ఇది చాలా దిగ్భ్రాంతికర వార్త అని, అసలు ఏం జరుగుతోందో తెలియడం లేదని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని బాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ విశాల్ దడ్లానీ అన్నారు.