శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 జూన్ 2020 (19:12 IST)

సుశాంత్ సూసైడ్.. మాటలకందని వేదన : ప్రిన్స్ మహేష్ బాబు

బాలీవుడ్ యువ హీరో, ధోనీ బయోపిక్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర్ సింగ్ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ఎంఎస్ ధోనీ: ద అన్ టోల్డ్ స్టోరీ'. ఈ చిత్రంలో ధోనీ పాత్ర పోషించడం ద్వారా సుశాంత్ భారతీయులపై వేసిన ముద్ర అలాంటిది. ఈ యువ హీరో ముంబై, బాంద్రాలోని తన నివాసంలో ఉరేసుకుని చనిపోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
 
ఈ అంశంపై స్పందిస్తూ టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అకాల మరణం గురించి తెలుసుకున్న తర్వాత మాటలకందని వేదన కలిగిందని, షాక్ కు గురయ్యానని వెల్లడించారు. 
 
పొంగిపొర్లే ప్రతిభకు నిదర్శనం లాంటి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చాలా చిన్నవయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లాడని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. 
 
అలాగే, సుశాంత్ మరణవార్త బాలీవుడ్ ను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఎంతో భవిష్యత్ ఉందని భావిస్తున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే మాటలు రాలేదని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. 
 
సుశాంత్ నటించిన 'చిచ్చోరే' సినిమా చూసి ఎంతో ఆస్వాదించానని, అపారమైన టాలెంట్ ఉన్న నటుడు అని కీర్తించారు. దర్శకుడు అనురాగ్ కశ్యప్ స్పందిస్తూ, తాను విన్నది నిజం కాదు అంటూ వ్యాఖ్యానించారు. ఈ పరిణామం షాక్ కలిగిస్తోందని అన్నారు.
 
సోనూ సూద్ ఈ ఘటనపై వ్యాఖ్యానిస్తూ, సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి గుండె బద్దలైందన్నారు. ఇది నిజం కాకపోతే బాగుండు అంటూ తీవ్ర విచారం వెలిబుచ్చారు. 
 
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. సుశాంత్ అద్భుతమైన నటుడు అని, సుశాంత్ ఇక లేడని తెలిసి తీరని వేదన కలిగిందని వ్యాఖ్యానించారు.